అది సభకాదు దురాక్రమణ


తెలంగాణ ప్రజలపై దాడి
సభను అడ్డుకుంటాం : మందకృష్ణ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :
హైదరాబాద్‌లో జరుగుతున్న ఏపీఎన్జీఓలది సభ కాదని, అది తెలంగాణ ప్రజలపై దాడి అని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన  హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని బహిష్కరిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌  వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.  తెలంగాణవాదులు శాంతియుతంగా ఉద్యమా లు చేస్తుంటే ఉక్కుపాదంలో అణచివేసిన సీమాంధ్ర ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యమాలకు ముందస్తు అనుమతులు ఇవ్వడం కుట్రేనని అన్నారు.  వ్యూహాత్మకంగా రెండు అగ్రవర్ణాలు సమైక్య రాష్ట్ర ఉద్యమం చేస్తూ మళ్లీ వారి ఆధిపత్యమే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని, సమైక్య ఉద్యమంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరూ పాల్గొనడంలేదన్నారు. సీమాంధ్రలో కేవలం సమైక్య ఉద్యమమే జరుగుతున్నట్టు, హైదరాబాద్‌లోనూ సమైక్య ఉద్యమాలు జరుగుతున్నాయని మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నదని అన్నారు. ఇదంతా హైదరాబాద్‌ను ఆక్రమించుకునే కుట్రగా ఆయన అభివర్ణించారు.తాము హైదరాబాద్‌లో సభ నిర్వహించుకుంటామంటే అనుమతి ఇవ్వని ప్రభుత్వం సమైక్యం పేర సభకు అనుమతివ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఏపీఎన్జీఓల సభను కచ్చితంగా అడ్డుకుంటామని, శనివారం బంద్‌లో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది ఏపీఏన్జీలో సభ కాదని, అది ముఖ్యమంత్రి కిరణ్‌ సృష్టించిన సీఎం సభగా మందకృష్ణ పేర్కొన్నారు. ఇక ఎంతోకాలం కిరణ్‌ పదవిలో ఉండలేరని, ఆయన పదవీ కాలం ఇంకా రెండు నెలలే ఉందని జోస్యం చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్‌, డీజీపీ దినేష్‌రెడ్డిలను తాము బహిష్కరిస్తున్నట్టు మందకృష్ణ ప్రకటించారు.