రణరంగమైన ఓయూ

విచ్చలవిడిగా బాష్పవాయు ప్రయోగం
శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
విద్యార్థులపై లాఠీచార్జి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :
ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. విద్యార్థుల శాంతిర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలు, లాఠీచార్జీలు, బాష్పవాయు గోళాలతో మార్మోగింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు యత్నించగా ఖాకీలు రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. లాఠీలతో కుళ్లబొడిచారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిచ్చి, టీఎన్జీవోల శాంతిర్యాలీకి అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా విద్యార్థులు శనివారం ఉదయం ఓయూ నుంచి బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. అయితే, శాంతియుతంగా నిరసన ప్రదర్శన  చేస్తున్నామని, తమను అడ్డుకోవద్దని విద్యార్థులు ప్రాధేయపడ్డారు. ముందుకు వెళ్లేందుకు అనుమతి లేదని, నగరంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ర్యాలీలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. వెనక్కు తిరిగివెళ్లాలని, క్యాంపస్‌లోనే నిరసన ప్రదర్శనలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు గోబ్యాక్‌, సీమాంధ్ర ప్రభుత్వం డౌన్‌డౌన్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులు బారికేడ్లను తొలగించేందుకు యత్నించగా ఖాకీలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఉదయం నుంచి సాయంత్రం విడతల వారీగా ఇదే పరిస్థితి పునరావృతమైంది. విద్యార్థులు క్యాంపస్‌ దాటి వెల్లేందుకు యత్నించడం, వారిపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం దీంతో క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించొద్దని హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, పోలీసులు వాటిని తుంగలో తొక్కారు. శాంతి ర్యాలీకి అనుమతించాలని వచ్చిన విద్యార్థులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు.