మా గడ్డపై దాడులు చేస్తారా? సహనానికి హద్దుంటది

సీఎం స్పాన్సర్‌ సభ
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :
ఏపీఎన్జీవోలు తెలంగాణవాదులపై దాడులు చేస్తే సహించబోమని టీ జేఏసీ హెచ్చరించింది. సీమాంధ్ర ప్రభుత్వం, ఉద్యోగులు రెచ్చగొడుతున్నా తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. తెలంగాణ ఆకాంక్షను దెబ్బ కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విభజనను అడ్డుకొంటే ఊరుకోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సమైక్య సభలకు అనుమతిచ్చి, సీమాంధ్రలో బహుజనుల సభలను అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. శనివారం టీఎన్జీవో భవన్‌లో కోదండరామ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా సీమాంధ్ర ఉద్యోగులు ప్రవర్తించొద్దని సూచించారు. సమైక్య వాదానికి బలం లేదని గుప్పెడు మంది పెట్టుబడిదారులు, సీమాంధ్రులు సమైక్య రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సభకు అనుమతి వెనక్కు తీసుకోవాలని సీఎంకు చెప్పడంలో తెలంగాణ మంత్రులు విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ మంత్రులు సరిగా లేకపోవడం వల్లే సీఎం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం బలహీనుడన్న విషయం ఇవాళ్టితో తేలిపోయిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకొనేందుకు సీమాంధ్రుల సభలకు సీఎం అనుమతిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారని, తమ పోరాటం సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కాదని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ బంద్‌ను విఫలం చేసేందుకు అన్ని జిల్లాల్లో జేఏసీ నాయకులను ఏకపక్షంగా అరెస్టు చేశారన్నారు. అయినా, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించి తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పారన్నారు. నిజాం కాలేజీ హాస్టల్‌లోకి పోలీసులు చొరబడి రణరంగం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. నిజాం కళాశాల హాస్టల్‌ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని కోదండరామ్‌ అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. హాస్టల్‌ రూంలలోకి చొరబడి విద్యార్థులను చావబాదడం, అల్పాహారం తింటున్న వారిని అరెస్టు చేయడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు. ప్రిన్సిపల్‌ అనుమతి లేకుండా హాస్టల్‌లోకి ఎలా వెళ్తారని నిలదీశారు. పోలీసుల చర్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.