కిరణ్‌ను సాగనంపండి రాష్ట్రపతి పాలన విధించండి

చంద్రబాబు ఓ రాజకీయ వ్యభిచారి : పాల్వాయి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనంసాక్షి) :
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్రపతి పాలన పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని తాము అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లామని, వారు కూడా సముఖతు వ్యక్తం చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీలో విభజనకు ఒప్పుకొని, హైదరాబాద్‌లో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం పాల్వాయి విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా పాలన క్షీణించిందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. అందుకే రాష్ట్రప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని తాము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమ వాదనతో అధిష్టాన పెద్దలు ఏకీభవించారని చెప్పారు. గతంలో రాష్ట్రపతి పాలన విధించాకే మూడు రాష్టాల్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గవర్నర్ నరసింహన్‌కు రాష్ట్రపతి పాలనలో ఎలా వ్యవహరించాలో అనుభవం లేదని అందువల్ల రాజకీయ అనుభవం ఉన్న వారిని ఆ పదవిలో నియమించాలని కోరారు. సీమాంధ్రులది కృత్రిమ ఉద్యమమని ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్జీవోలు సభ అనవసరంగా నిర్వహించారన, ఈ సభ ద్వారా సీమాంధ్ర ఉద్యోగులు లేని పోని సమస్యలు సృష్టించారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పాల్వాయి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ మళ్లీ వైఖరి మార్చుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. సమైక్య ఉద్యమంపై చంద్రబాబు సీమాంధ్ర ప్జలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స ఢిల్లీలో తలవూపి రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని వారికి హితవు పలికారు.



