మేడమ్‌ చేతిలో నోట్‌


శుక్రవారం కోర్‌ కమిటీ భేటీ
జెట్‌ స్పీడ్‌తో తెలంగాణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ తయారు చేసిన నోట్‌ గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి చేరినట్లు తెలిసింది. వారం రోజులు అమెరికాలో ఉన్న సోనియా బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె వచ్చిన తర్వాత తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేస్తారన్న సంకేతాలు ఏఐసీసీ ఇదివరలోనే పంపింది. అయితే, హోంశాఖ రూపొందించిన నోట్‌కు సోనియాగాంధీ ఆమోదం తెలపడమే తరువాయి. కాంగ్రెస్‌ కోర్‌కమిటీలో ఈ నోట్‌పై మరోసారి చర్చించనున్నారు. గురువారం జరిగే కేబినెట్‌ భేటీలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం లేకపోయినా శుక్రవారం జరిగే కోర్‌కమిటీలో మాత్రం దీనిపై విస్తృతంగా చర్చించనున్నారు. వచ్చే వారం కేబినెట్‌ ఆమోదానికి ఈ నోట్‌ వెళ్లనుంది. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను తయారు చేస్తామంటూ హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే. దీంతో విభజన ప్రక్రియను ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ నిబంధనలకు లోబడి గతంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాల ఏర్పాటును సందర్భాలకు తీసుకున్న పలు జాగ్రత్తలు నియమ నిబంధనాలు, క్షుణ్ణంగా పరిశీలించే ఈ నోట్‌ను తయారు చేశారు. రాజకీయ ఆమోదం తీసుకున్న తర్వాతే ఈ నోట్‌ను క్యాబినెట్‌ ముందుంచుతారు. అక్కడ చర్చించాక పరిశీలానార్దం న్యాయమంత్రిత్వ శాఖకు నివేదిస్తారు. కేబినెట్‌ నోట్‌ కూడా ఎంత త్వరగా తయారు చేయడం కేంద్ర వేగానికి నిదర్శనం. ఒకవైపు రాష్ట్ర విభజించవద్దని సీమాంధ్ర ప్రాంతంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర, కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. కేబినెట్‌ ముందుకు కూడా ఈ నోట్‌ ఈ నెల 19, లేదా 26న రావడం ఖాయంగా కనిపిస్తోంది. వెంటనే కేబినెట్‌ ఆమోదం తీసుకొని ప్రక్రియను వేగవంతం చేస్తారు. సెప్టెంబరు చివరి వారంలోకల్లా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ద్వారా కేబినెట్‌ నోట్‌ను శాసనసభలో అభిప్రాయాలు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు 9వ తేదీ నాటికి రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసి అదేరోజు ఉత్తర్వులు వెలువరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ రోజు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం కావడం, 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ తేదీలోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.

తాజావార్తలు