నిర్భయ నిందితులకు ఉరే సరి

అరుదైన కేసుల్లో ఒకటి
ఈ తీర్పు మహిళల్లో విశ్వాసం పెంచుతుంది
సాకేత్‌ కోర్టు న్యాయమూర్తి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) :
యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదరు చూసిన చారిత్రక తీర్పు వెలువడింది. దేశాన్ని కదిలించిన కీచకులకు మరణ శిక్ష పడింది. ‘నిర్భయ’ కేసులో నలుగురు నిందితులకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. భారత న్యాయవ్యవస్థపై మరింత గౌరవం ఇనుమడింపేలా చేసిన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ‘నిర్భయ’కు న్యాయం జరిగిందంటూ వేలాది గొంతుకలు కదిలి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. గతేడాది డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన ఘోర కీచక పర్వంపై శుక్రవారం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు దోషులు వినయ్‌ శర్మ (20), అక్షయ్‌ ఠాకూర్‌ (28), పవన్‌ గుప్తా (19), ముఖేశ్‌ (26)లకు మరణ శిక్ష విధించింది. ఈ నలుగురిని గత వారమే దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. నలుగురు నిందితులపై మోపిన 13 అభియోగాలు రుజువు కావడంతో ఈ నెల 10న కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. ఈ నెల 11న శిక్ష ఖరారుకు సంబంధించి వాదనలు విన్న న్యాయమూర్తి యోగేశ్‌ ఖన్నా శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ న్యాయమూర్తి నిందితులకు మరణ శిక్ష విధించారు. నేర తీవ్రత దృష్ట్యా నిందితులపై జాలి చూపలేమని స్పష్టం చేశారు. ‘మిగతా నేరాలను పక్కన బెడితే హత్యా నేరం (ఐపీసీ 302) కింద వారికి ఉరేసరి. అమానవీయంగా ప్రవర్తించి, అత్యంత కిరాతకంగా, పాశవిక నేరానికి పాల్పడిన వారిని ఉపేక్షించేదే లేదు. నేర తీవ్రత దృష్ట్యా వారికి ఉరిశిక్ష విధిస్తున్నా’నని తెలిపారు. ఇలాంటి తీవ్రమైన అకృత్యాలను న్యాయస్థానాలు చూసీ చూడనట్లు వ్యవహరించజాలవని స్పష్టం చేశారు. ‘రోజురోజుకీ మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని పట్టించుకోకుండా ఉండలేం’ అని వ్యాఖ్యానించారు. ‘అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి గురై, పాశవిక హత్యకు గురైన యువతి కేసులో గరిష్ట శిక్ష విధించడం సబబే. ఈ కేసు అత్యంత అరుదైన కేసుల్లో అరుదైన కేసు. అందుకే నిందితులందరికీ మరణశిక్ష’ అని తెలిపారు. తాజా తీర్పుతో మహిళల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుందని ఆకాంక్షించారు. ఇలాంటి కేసులను ఉపేక్షించబోమనే ఈ తీర్పు వెలువరిస్తున్నట్లు న్యాయమూర్తి జడ్జిమెంట్‌లో పేర్కొన్నారు.దేశాన్ని కదిలించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్‌ 16న ఢిల్లీ నడివీధుల్లో మహిళపై అత్యంత పాశవిక దాడి జరిగింది. ఆరుగురు నిందితులు కదులుతున్న బస్సులో తిప్పుతూ యువతిపై కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేయడమే కాకుండా తీవ్రంగా గాయపరిచారు. ఆమె స్నేహితుడిపైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నిర్భయ డిసెంబర్‌ 29న సింగపూర్‌ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యావత్‌ జతిని కదిలించింది. అతివపై జరుగుతున్న దాడులను దేశం ముక్తకంఠంతో ఖండించింది. యువత కదిలిరావడంతో దేశ రాజధాని ఢిల్లీ స్తంభించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అత్యాచారాల నిరోధక చట్టానికి మరింత పదును పెడుతూ ‘నిర్భయ’ చట్టం తీసుకొచ్చింది. దేశాన్ని కదిలించిన ఈ కేసు విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసింది. తొమ్మిది నెలల పాటు విచారించిన న్యాయస్థానం 84 మంది సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది. నలుగురు నిందితులపై 13 సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయని, వారు దోషులేనని పేర్కొన్న కోర్టు.. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా వారందరు దోషులని తేలింది. ప్రధాన నిందితుడు రాంసింగ్‌ (బస్సు డ్రైవర్‌) గత మార్చి 11న తీహార్‌ జైలులోని తన సెల్‌లో ఊరేసుకున్నారు. మరో నిందితుడు మైనర్‌ కావడంతో అతడికి మూడేళ్ల జైలు శిక్ష ఇప్పటికే ఖరారైంది. మిగతా నలుగురికి సాకేత్‌ కోర్టు ఉరిశిక్ష విధించడంతో నిందితులందరికీ శిక్ష పడినట్లయింది. ఉరిశిక్ష పడడంతో నిందితులు ఆందోళనకు గురయ్యారు. నిందితుల్లో ఒకడైన వినయ్‌ కోర్టు హాలులోనే బోరుమన్నాడు.
సాకేత్‌ కోర్టులో సంబరాలు
సాకేత్‌ కోర్టు ప్రాంగణం న్యాయవాదులు, విూడియా, ప్రజాసంఘాలతో కిక్కిరిసిపోయింది. కిక్కిరిసిన కోర్టు హాలులో న్యాయమూర్తి యోగేశ్‌ ఖన్నా ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించగానే సంబరాలు మిన్నంటాయి. తీర్పు చదవడం పూర్తి కాకముందే ఆ ప్రాంతమంతా ¬రెత్తింది. కోర్టు పరిసరాల్లో యువత, మహిళా, ప్రజాసంఘాలు విజయోత్సవాలు నిర్వహించాయి.
కేసు పరిణామ క్రమమిది
డిసెంబర్‌ 16: న్యూఢిల్లీలో కదులుతున్న బస్సులో ‘నిర్భయ’పై సామూహిక అత్యాచారం, అదే రోజు రాత్రి ఆస్పత్రికి తరలింపు
డిసెంబర్‌ 17: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన, నిందితులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్‌ నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు
డిసెంబర్‌ 18: ప్రధాన నిందితుడు రాంసింగ్‌ సహా మరో ముగ్గురి అరెస్టు
డిసెంబర్‌ 20: బాధితురాలి స్నేహితుడి విచారణ
డిసెంబర్‌ 21-22: నిందితులను గుర్తించిన నిర్భయ స్నేహితుడు, ఇద్దరు నిందితుల అరెస్టు
డిసెంబర్‌ 23: ఢిల్లీలో మిన్నంటిన నిరసనలు.. స్తంభించిన హస్తిన
డిసెంబర్‌ 25: నిర్భయ పరిస్థితి విషమం
డిసెంబర్‌ 26: బాధితురాలికి గుండెపోటు.. సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి తరలింపు
డిసెంబర్‌ 29: తుదిశ్వాస విడిచిన నిర్భయ, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు
జనవరి 3, 2013: ఐదుగురు నిందితులపై చార్జిషీట్‌ దాఖలు
జనవరి 5-7: చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు. ఇన్‌కెమెరా విచారణ ప్రారంభం
జవరి 17: ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు కార్యకలాపాలు ప్రారంభం
మార్చి 11: తీహార్‌ జైలులో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య
మార్చి 22: కోర్టు విచారణకు జాతీయ మీడియాను అనుమతించిన ఢిల్లీ హైకోర్టు
జూలై  5: మైనర్‌ నిందితుడిపై జువైనల్‌ కోర్టులో విచారణ. తీర్పు జూలై 11కు వాయిదా
జూలై  8: ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సాక్షుల వాంగ్మూలం నమోదు ప్రారంభం
జూలై  22: ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో నలుగురు నిందితులపై తుది వాదనలు ప్రారంభం
ఆగస్టు 31 : మైనర్‌ను దోషిగా తేల్చిన జువైనల్‌ జస్టిస్‌ బోర్డు. మూడేళ్ల జైలు శిక్ష విధింపు
సెప్టెంబర్‌ 3: ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ముగిసిన విచారణ. తీర్పు వాయిదా
సెప్టెంబర్‌ 10: నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు
సెప్టెంబర్‌ 11: ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో శిక్ష ఖరారుపై వాదనలు.. తీర్పు వాయిదా
సెప్టెంబర్‌ 13: నిందితులకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం.

తాజావార్తలు