పీవీ ఫ్లై ఓవర్‌ పేదల కోసం కాదు


హైదరాబాద్‌ తెలంగాణతో ఉంటేనే వికాసం
30న చలో హైదరాబాద్‌కు తరలిరండి : కోదండరామ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామనడం  సీమాంధ్ర నాయకులకు తగదని, ఇక్కడ రూ. 2500 కోట్లతో నిర్మించిన పీవీ ఫ్లై ఓవర్‌ ఏనాడూ ప్రజలకు ఉపయోగపడలేదని రాజకీయ ఐకాస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌పై సీమాంధ్రులు పేచీ పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను వేరు చేయడమంటే శరీరం నుంచి తలను వేరు చేయడమేనన్నారు.  కేంద్ర ప్రాంత పాలితం చేయాలని, ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న సీమాంధ్ర నేతల డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్‌ వికాసం రీత్యా దీనిని తెలంగాణలో అంతర్భాగంగా ఉంచాలన్న విషయాన్ని అంగీకరించాలని కోరారు. పీవీ ఫ్లై ఓవర్‌కోసం ఖర్చు చేసిన డబ్బులతో హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరమయ్యేదని అభిప్రాయపడ్డారు. ఈ నెల 30న ఐకాస నిర్వహించనున్న సభకు నేతలు, నాయకులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌, గాయకుడు రసమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు