ఒడిశాలో భారీ ‘ఎన్‌కౌంటర్‌’


14 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో ఘటన
ఒడిశా, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) :
కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లో తుపాకుల మోత మోగింది. శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు సమీపంలోని మల్కాన్‌గిరి జిల్లా సిల్లాకోట వద్ద అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు-నక్సలైట్లకు ఎదురు కాల్పులు జరిగాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల రహస్య సమావేశం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు మావోలున్న ప్రదేశానికి చేరుకున్నారు. నలువైపులా నుంచి వారిని చుట్టుముట్టారు. దీంతో మావోలు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఇరువైపులా నుంచి భీకరంగా కాల్పులు జరిగిన చాలాసేపటికి అటువైపు నుంచి శబ్ధం ఆగిపోయింది. అక్కడికి వెళ్లి చూడగా, 14 మంది మావోయిస్టులు మృతి చెంది ఉన్నారు. ఘటనా స్థలం భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తి సమాచారం రావడానికి కొంత సమయం పడుతుందని సౌత్‌ వేస్ట్‌ రేంజ్‌ డీఐజీ దేవదత్తా సింగ్‌ తెలిపారు. ఎదురుకాల్పుల్లో పోలీసులెవరికీ గాయాలు కాలేదన్నారు. మల్కాన్‌గిరి ఎస్పీ అఖిలేశ్వర్‌సింగ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా బలగాలు చేపడుతున్న యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌కు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఆయన మార్గదర్శనంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారిలో వరంగల్‌ జిల్లా పోచన్నపేటకు చెందిన మావోయిస్టు ప్రమీల అలియాస్‌ మీనా ఉన్నట్లు గుర్తించారు. పొడియా ప్రాంతీయ మావోయిస్టు కమిటీ దళ సభ్యురాలిగా ప్రవిూల పని చేస్తున్నారు. గత నెల రోజుల పోలీసులు మావోల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఇటీవలే 25 మంది సభ్యుల బృందం లొంగిపోయింది. 38 మంది భద్రతా సిబ్బందిని బలిమెల రిజర్వాయర్‌లో హతమార్చిన మావోల ముఖ్య నేత గొల్ల రాములు అలియాస్‌ మాధవ్‌ సహా పలువురు ఆగస్టు నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డారు. తాజాగా 14 మంది మృతితో మావోలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.