సీడబ్ల్యూసీ నిర్ణయం శిరోధార్యం : డీఎస్‌


సీఎం కిరణ్‌ ఆపినా.. తెలంగాణ ఆగదు : డీకే అరుణ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు ఎంతో మే లు జరుగుతుందని, విభజన వల్ల రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమని దాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఏ ప్రాంతానికి అన్యాయం చేయరని అన్ని ప్రాంతాలకు తగిన న్యాయం చేస్తారని చెప్పారు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రసంగిస్తూ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలదే బాధ్యత అని స్పష్టం చేశారు. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని సీఎం, పీసీసీ చీఫ్‌తో పాటు సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్న విపక్షాల విమర్శలను డీఎస్‌ తప్పుబట్టారు. సీమాంధ్రలోని అన్ని పార్టీలతో సంప్రదించాకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమతో సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నారని కొన్ని పార్టీలు పేర్కొనడం భావ్యం కాదని మండిపడ్డారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ పక్షపాతి అనడం సరికాదన్నారు. ఆమె తెలంగాణకే మేలు చేశారనడం భావ్యం కాదని తెలిపారు. సోనియా ఏ ప్రాంతానికి అన్యాయం చేయరని దృష్టిలో దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. సోనియాగాంధీపై కావాలని దుష్పచ్రారం చేస్తున్నారని.. దాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనతో రెండు ప్రాంతాలకు మేలు జరుగుతుందని డీఎస్‌ తెలిపారు. తెలంగాణ,  సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. ఈ విషయాన్ని నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం సరికాదని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని కోరారు. సమ్మె వల్ల సాధరణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. హైకమాండ్‌ ఏ ప్రాంతానికీ అన్యాయం చేయదని, సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల అనుమానాలు నివృత్తి చేస్తామని ఆయన చెప్పారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరుతుందని మంత్రి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఎవరు అడ్డు పడినా విభజన ఆగదని స్పష్టం చేశారు. విభజన ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను కేబినెట్‌ ముందుకు తీసుకువస్తుందని చెప్పారు. అరుణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ పెద్దలకు రోగాలచ్చాయన్న తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. రోగాలు ఉన్నది కాంగ్రెస్‌కు కాదని, తెలుగుదేశం పార్టీకేనని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు పూనుకున్నందుకే సోనియాకు క్యాన్సర్‌, షిండే, ఆజాద్‌, ఆంటోనీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ సోమవారం ఆరోపించారు. ఆ ఆరోపణలను అరుణ తిప్పికొడుతూ అలాంటి అర్థం లేని వ్యాఖ్యలు చేయడం ద్వారా తమను తాము దిగజార్చు కుంటున్నారని రోగాలున్నది చంద్రబాబుకేనని ఘాటుగా విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాన్నాళ్లు రాష్ట్రంలో కరువు కాటకాలేనని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి లేక అధోగతి పాలైందని విమర్శించారు. రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తెలుగు ప్రజలకు ద్రోహం చేసిందని చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9 ప్రకటనకు ముందు తెలంగాణకు అనుకూలమని చెప్పి ఆ తర్వాత మాట మార్చిన చరిత్ర బాబుదేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ఏర్పడి తీరుతుందని అరుణ తేల్చి చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలకు హైకమాండ్‌ బెదిరిపోదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ సహా ఎవరు అడ్డు పడినా తెలంగాణ మాత్రం ఆగదని తేల్చి చెప్పారు. విభజన ప్రక్రియను వేగవంతం చేసేందుకు హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. హైకమాండ్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని త్వరలోనే రాష్ట్రం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజావార్తలు