69 కంటే ఉద్యమం ఉధృతంగా ఉంది


తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మాడిపోతది : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమం 1969 కంటే ఉధృతంగా ఉందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని టీ జేఏసీ కార్యాలయంలో ‘తెలంగాణ సమాలోచన’ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ప్రస్తుతం సాగుతున్న ఉద్యమంలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోందని అన్నారు. ఒక ప్రాంతం వారితో మాత్రమే నిర్వహించే సభలు సమైక్య సభలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు పాల్గొనకుండా నిర్వహించే ఏ సభ అయినా సమైక్యతకు అద్దం పట్టదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సదస్సుపై కోదండరామ్‌ ఈ విధంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణంలోనూ ప్రజాసంఘాల పాత్ర ఎలా ఉండాలన్న అంశంపై ‘తెలంగాణ సమాలోచన’ సదస్సులో చర్చిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ఈనెల 13, 14 తేదీల్లో సమాలోచన సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ శక్తులనే గెలిపించాలని, తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర శక్తులు తెలంగాణను అడ్డుకునేందుకు ఇప్పటికీ కుట్రల కత్తులు నూరుతున్నాయని తెలిపారు. ఆ శక్తుల పట్ల ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ దశలోనూ ఆపబోమని, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేరోజూ వరకూ పోరుదారిన నడుస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎలా అభివృద్ధి చేసుకోవాలో, ప్రజాస్వామిక తెలంగాణ ఎలా నిర్మించుకోవాలో తెలంగాణ సమాలోచన సదస్సులో చర్చిస్తామని తెలిపారు. సకల వనరులున్న తెలంగాణను అన్నింటా ముందుంచేలా టీ జేఏసీ ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, పిట్టల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.