చిన్న నగరాలకు విమాన సర్వీలు

100పైగా విమానశ్రయాలు
ప్రధాని మన్మోహన్‌సింగ్
జైపూర్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) :
దేశవ్యాప్తంగా త్వరలో 100కు పైగా చిన్న విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా కిషన్‌గఢ్ విమానాశ్రయానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2020 నాటికల్లా విమాన ప్రయాణికుల రద్దీ 30 కోట్లకు చేరవచ్చన్న నేపథ్యంలో చిన్న చిన్న ప్రాంతాల్లో సైతం విమాన సర్వీసులు అందుబాటులోకి తేవాల్సిన అవసరముందన్నారు. 2016నాటికల్లా కిషన్‌గఢ్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పుడిక చిన్న పట్టణాలు, నగరాల్లో వందకుపైగా విమానాశ్రయాల ఏర్పాటుపైనే దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు భారీగా పెరగాలని ఆయన ఆశించారు. ఎన్నో నగరాల్లో చిన్నచిన్న విమానాశ్రయాలు ఉన్నప్పటికీ సేవలు తదనుగుణంగా లేవని పౌరవిమానయాన మంత్రి అజిత్‌సింగ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కొత్తగా విమాన సర్వీసులను ప్రారంభించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు



