రాజకీయ నిర్ణయంపై సమ్మె చేస్తారా?


రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు ఏమాధారాలున్నాయి?
ఏపీఎన్‌జీవోలపై హైకోర్టు సీరియస్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) :
రాజకీయ నిర్ణయంపై సమ్మె ఎలా చేస్తారంటూ ఏపీఎన్జీ వోలపై రాష్ట్ర ఉన్నత న్యా యస్థానం సీరియస్‌ అయిం ది. రాజకీయ నిర్ణయాలపై సమ్మె చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. సమ్మె వల్ల  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీన్ని కోర్టు చూస్తూ ఊరుకోదని తెలిపింది. విూ పని విూరు చేసుకోండి మా పని మేం చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రధాని గానీ, ప్రభుత్వం గానీ ప్రకటించనప్పుడు ఏ ఆధారంతో సమ్మె చేస్తారని నిలదీసింది. సర్వీసు రూల్స్‌ కాకుండా రాజకీయ నిర్ణయాలపై చేస్తున్న సమ్మెను రాజ్యాంగ విరుద్ధంగానే భావించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఏపీ ఎన్జీవోల సమ్మెపై దాఖలైన పిటిషన్‌ను శనివారం వరుసగా ఆరో రోజూ విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్‌ కేసీ భానులతో కూడిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. శనివారం ఉదయం విచారణ ప్రారంభం కాగానే.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమిస్తున్నారా? కొనసాగిస్తున్నారా? అని ప్రధాన న్యాయమూర్తి ఏపీ ఎన్జీవోల సంఘం, సీమాంధ్ర సెక్రటేరియట్‌ ఫోరంలను ప్రశ్నించారు. తాము సమ్మె కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర సెక్రటేరియట్‌ ఫోరం తరఫు న్యాయవాదులు బదులిచ్చారు. ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమ్మె విరమించాలని కోరారు. ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మె వల్ల కొంత మందికి రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. సమ్మె ఎక్కువ కాలం కొనసాగడం సరికాదని సూచించారు. అయితే, తాము ప్రజల మద్దతుతోనే సమ్మె చేస్తున్నామని సీమాంధ్ర సెక్రటేరియట్‌ ఫోరం న్యాయవాది తెలిపారు. తాము సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించ లేదని, సమ్మెపై ముందుగా నోటీసు ఇచ్చే ఆందోళనను ప్రారంభించామని చెప్పారు. హక్కుల సాధన కోసం సమ్మె చేయడం ఉద్యోగుల హక్కు అని, ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు. గతంలోనూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కూడా సకల జనుల సమ్మె నిర్వహించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మీరు రాజకీయ నిర్ణయాల కోసం సమ్మె చేస్తున్నారా? సర్వీసు రూల్స్‌ కోసం చేస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. రెండింటికోసమని ఏపీ ఎన్జీవోలు, సీమాంద్ర సెక్రటేరియట్‌ ఫోరం తరఫు న్యాయవాది చెప్పారు. సర్వీసు రూల్స్‌ కోసమైతే మాట్లాడవచ్చు కానీ, రాజకీయ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె సరికాదని సీజే అన్నారు. సమ్మె విరమించాలని మరోమారు కోరగా, ఏపీఎన్జీవోలు నిరాకరించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి వారిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ… కోర్టు కూడా తన పని తాను చేస్తుందని తెలిపారు. సమ్మె కొనసాగిస్తూ కొంత మందికి ప్రయోజనాలు చేకూరే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించాలని సూచించారు. సమ్మె కాలంలో ఏపీ ఎన్జీవోలు 138 కోట్ల జీతాలు తీసుకున్నారని.. అలాంటప్పుడు ఈ రకమైన ఆందోళనలు సరికావన్నారు.విభజనపై ఎక్కడ కూడా ఎటువంటి డాక్యుమెంట్‌ పెట్టకముందే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజన చేస్తున్నట్లు ప్రభుత్వం గానీ, ప్రధాని గానీ అధికారికంగా ప్రకటించారా? అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు గానీ, ఆధారాలు గానీ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఆధారాలు లేకుండా సమ్మెకు వెళ్లడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. విభజన వల్ల సమస్యలు తలెత్తుతాయని కొంత మంది ఒక మైండ్‌సెట్‌తో ఉండడం వల్లే సమ్మె జరుగుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. సర్వీసు రూల్స్‌ కోసం రాజ్యాంగ నిర్ణయాలపై సమ్మె చేస్తున్నామనడం సరైంది కాదన్నారు. అది చట్ట విరుద్ధమే అవుతుందని స్పష్టం చేశారు. మీరు మీ వాదనలు వినిపించుకోండి.. మా పని మేం చేసుకుపోతామని వ్యాఖ్యానించారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కోర్టులు తమ పని చేస్తాయని తెలిపారు. మిగతా వాదనలు తర్వాత వింటామని తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

తాజావార్తలు