దేశమంటే వ్యక్తులు కాదు

వ్యక్తిగత భజన ఆపండి
భాజపాకు రాహుల్‌ చురక
జగ్దల్‌పూర్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) :
దేశమంటే వ్యక్తులు మాత్రమే కాదని, భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తిగత భజనలు ఆపాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చురకలంటించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం బస్తర్‌ రీజియన్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీనుద్దేశించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. బీజేపీ నాయకులు వాస్తవాలు మరుగుపరిచి మసిబూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హామీని కూడా తామే చేసినట్టుగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో అధికార బీజేపీ శాంతిభద్రతలను గాలికొదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల క్యాన్వాయ్‌పై మావోయిస్టులు విరుచుకుపడి 27 మందిని హత్య చేసినా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతను హత్య చేసినా ఇలాగే వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు. మే 25న జరిగిన ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాగా లేదని అన్నారు. మావోయిస్టులు మాటువేసి కాంగ్రెస్‌ పార్టీ క్యాన్వాయ్‌పై దాడి చేసి పీసీసీ చీఫ్‌ నందకుమార్‌పటేల్‌, ఆయన తనయుడు దినేశ్‌, సీనియర్‌ లీడర్‌ వీసీ శుక్లా, గిరిజన నాయకుడు మహేంద్రకర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్‌ ముదలియార్‌ సహా 27 మందిని పొట్టనబెట్టుకున్నారని తెలిపారు. దేశ ప్రజలకోసం యూపీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. పేదలకు ఆహార భద్రతకోసం ప్రత్యేకంగా చట్టం తెచ్చామని, ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదనేది తమ లక్ష్యమన్నారు. విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం ద్వారా పాలన వ్యవస్థల్లో జవాబుదారితనం కల్పించామని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సాధికారిత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ను తాము అభివృద్ధి పథంలో ముందుకు నడిపితే బీజేపీ అభివృద్ధిలో పదేళ్లు వెనక్కు తీసుకెళ్లిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి, పీసీసీ అధ్యక్షుడు చరణ్‌దాస్‌ మహంత్‌, నాయకుల మోతిలాల్‌ ఓరా, బీకే హరిప్రసాద్‌, మొహసీన్‌ కిద్వాయ్‌ తదితరులు పాల్గొన్నారు.