జమ్మూలో మిలిటెంట్లదాడి
14 మంది జవాన్ల మృతి
శ్రీనగర్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన తీవ్రవాదులు వరుస దాడులతో కథువా జిల్లాలోని హీరానగర్ ఠాణాపై ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఆ వెంటనే సాంబా జిల్లాలో సైనిక స్థావరాలపై కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 14 మంది దుర్మరణం చెందారు. పోలీసులు అప్రమత్తపై వెంటనే వారి దాడులను తిప్పికొట్టారు. మృతి చెందిన వారిలో ఆరుగురు జవాన్లు, నలుగురు పోలీసులు, ఇద్దరు ఉగ్రవాదులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల అనంతరం జమ్మూ ప్రావిన్సులో ఉగ్రవాదులు దాడులకు దిగడం ఇదే తొలిసారి. ఈ నెల 29న భారత్, పాకిస్తాన్ ప్రధానమంత్రులు మన్మోహన్‌సింగ్, నవాజ్ షరీఫ్ సమావేశం కానున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం.గురువారం ఉదయం జమ్మూలో తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన తీవ్రవాదులు ముందుగా పోలీసుస్టేషన్ విూద దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆర్మీ క్యాంపు మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి చెందారు. ఆటోలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ముగ్గురు లేదా నలుగురు హీరానగర్ పోలీసుస్టేషన్‌పై విరుచుకుపడ్డారని అధికారులు తెలిపారు. గ్రేనెడ్లు విసురుతూ, కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారన్నారు. అనంతరం పాక్ సరిహద్దుల్లోని సాంబా జిల్లాలో సైనిక స్థావరాలపై దాడులకు పల్లపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు, ఓ పౌరుడు మృతి చెందాడన్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇటీవల దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా, జమ్మాకాశ్మీర్‌లో దాడులకు పాల్పడింది తామేనని అల్ షొహదా తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. తాజా దాడులతో పోలీసులు, భద్రతాబలగాలను అప్రమత్తం చేశారు. సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.
సమాచారం సేకరిస్తున్నాం: షిండే
ఉగ్రవాదుల దాడిని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తీవ్రంగా ఖండించారు. దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. పోలీసుస్టేషన్‌తో పాటు ఆర్మీ క్యాంపుపై కూడా దాడి జరిగిందని, ఈ దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా మరణించాడని చెప్పారు. సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ప్రధాని మన్మోహన్‌తో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి దాడి జరగడం దారుణమని వ్యాఖ్యానించారు. నలుగురు ఐదుగురు ఉగ్రవాదులు సరిహద్దుల్లోకి చొరబడ్డారని చెప్పారు.
భయపడేది లేదు: ప్రధాని
ఇదిలా ఉంటే.. ఉగ్ర దాడులను ప్రభుత్వం, ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇది శాంతి, చర్చలపై జరిగిన దాడి అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. శాంతిని వ్యతిరేకించే శక్తులు దాడులకు పాల్పడ్డాయని తెలిపారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చిత్తశుద్దితో ఉన్నామని చెప్పారు. పొరుగు దేశం సహాయ, సహాకారాలు అందుకుంటున్న తీవ్రవాదులే ఈ దాడులకు పాల్పడ్డారన్నారు. ఇలాంటి దాడుల వల్ల చర్చల ప్రక్రియకు విఘాతం కలగదని స్పష్టం చేశారు. ఇక, ఉగ్ర దాడులను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో తీవ్రవాద దాడుల ద్వారా పాక్ ప్రచ్ఛన్న యుద్ధానికి పాల్పడుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిది ప్రకాశ్ జగదేవకర్ మండిపడ్డారు. పాక్ తన భూభాగంలో ఉండి భారత్‌పై తీవ్రవాదుల దాడికి ఉసిగొల్పుతోందన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడులు జరగకుండా చూస్తామని ప్రధాని పార్లమెంట్‌లో ఇచ్చిన భరోసా గాలిలో దీపమైందని అభివర్ణించారు. ఉగ్రదాడులు అరికట్టేందుకు ప్రధాని కనీసం ఎటువంటి చర్యలు చేపట్టారనేది నేటికీ అంతపట్టని విషమని వ్యాఖ్యానించారు.



