లాలూ గడ్డి తిన్నాడు


దాణా కుంభకోణంలో దోషిగా నిర్ధారించిన సీబీఐ కోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) :
బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌యాదవ్‌కు ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది. దాణా కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో పాటు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం లాలూను దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో లాలూ భవితవ్యంతో పాటు ఆర్జేడీ మనుగడ ప్రమాదకరంగా పరిణమించింది. త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై కోర్టు తీర్పు తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్య ఉద్యోగులు డబ్బుకు ఆశపడి ‘గడ్డి’ తింటే ఏం జరుగుతుందో కోర్టు మరోసారి తేల్చి చెప్పింది. కోట్లాది రూపాయల విలువైన ఈ కుంభకోణంలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సుమారు 17 ఏళ్ల విచారణ తర్వాత సోమవారం తుది తీర్పు వెల్లడించింది. దాణా కేసులో లాలూతో పాటు మరో 45 మందిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి పీకే సింగ్‌ దోషులుగా తేల్చారు. వారందిరికీ అక్టోబర్‌ 3న శిక్ష ఖరారు చేయనున్నారు. దోషులుగా తేలిన వారిలో మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్‌ యాదవ్‌, జగన్నాథ్‌ మిశ్రాలతో పాటు ఆరుగురు రాజకీయ నేతలు, నలుగురు ఐఏఎస్‌ అధికారులు ఉన్నారు. లాలూ, మిశ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాంచి జైలుకు తరలించారు.లాలూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన దాణా కుంభకోణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కుంభకోణంలో లాలూ రూ.35.65 కోట్లు కాజేశారనే అభియోగాలపై దర్యాప్తు సంస్థ విచారణ జరిపింది.  ఈ అభియోగాలతోనే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తాజా కోర్టు తీర్పుతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోనున్నారు. కుంభకోణానికి సంబంధించి మొత్తం 61 కేసులు నమోదు కాగా, 44 కేసుల్లో 500 మందిని దోషులుగా నిర్ధారించి కోర్టులు శిక్షలు విధించాయి. సుమారు 17 ఏళ్ల విచారణ అనంతరం సీబీఐ కోర్టు లాలూను దోషిగా తేల్చింది. ఈ కేసులో లాలూలతో పాటు మరో 45 మందిని దోషులుగా నిర్ధారించింది. సీబీఐ దోషులుగా నిర్ధారించిన వారిలో ఆరుగురు రాజకీయ నేతలు, నలుగురు ఐఏఎస్‌లు ఉన్నారు. లాలూకీ కనిష్టంగా మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి కోర్టు అక్టోబర్‌ 3న శిక్షలను ఖరారు చేయనుంది.
దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్‌యాదవ్‌ను పోలీసులు రాంచీలోని బిస్రాముండా సెంట్రల్‌ జైలుకు తరలించారు. అంతకు ముందు లాలూ భారీ భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించిన అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే, కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు ఆర్జేడీ ప్రకటించింది. శిక్ష ఖరారు తర్వాత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్‌ ఝా వెల్లడించారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్రల అని ఆరోపించారు.
ఎంపీ పదవి కోల్పోనున్న లాలూ..
దాణా కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ అయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. సుప్రీంకోర్టు తాజా మేరకు ఆయనపై వేటు పడనుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు తక్షణమే చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోవడంతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగడం, సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనర్హత వేటు పడిన తొలి ప్రజాప్రతినిధిగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిలవబోతున్నారు. దోషిగా తేలిన లాలూ ఎంపీ పదవిని కోల్పోవడంతో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడు కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. త్వరలో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు వీలుండదు.