ఇన్‌చార్జి డీజీపీగా ప్రసాదరావు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి)  డీజీపీగా దినేశ్‌రెడ్డి పదవి విరమణ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర పోలీసు అధిపతి నియా మకాని కోసం సీనియర్ల జాబితాను పరిశీలిస్తోంది. ఐదారుగురి పేర్లను పరిశీ లిస్తున్నప్పటికీ, ఇద్దరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. డీజీపీ పదవి కోసం ¬ం శాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్‌తో పాటు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ బయ్యారపు ప్రసాదరావు పోటీ పడుతున్నారు. 1979 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన టీపీ దాస్‌ 2015 నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఒడిశా రాష్టాన్రికి చెందిన దాస్‌ కంటే ప్రభుత్వం ప్రసాదరావు వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రసాదరావు పదవీ కాలం 2015 సెప్టెంబర్‌ నాటికి ముగియనుంది. 1977 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ వారిద్దరి కంటే సీనియారిటీ జాబితాలో ముందున్నప్పటికీ, ఫోర్జరీ కేసులో చిక్కుకున్న ఆయనకు అత్యున్నత పదవి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. కాగా, అరుణా బహుగుణ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమె రాష్టాన్రికి రావడానికి విముఖతతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రసాదరావునే ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. తాజా పరిణామాలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి. బయ్యారపు ప్రసాదరావు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న బయ్యారపు ప్రసాదరావు గతంలో అనేక కీలక పదవులు నిర్వర్తించారు. ఆర్టీసీ ఎండీగా, హైదరాబాద్‌, విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌గా, పలు జిల్లాల ఎస్పీగా పదవులు నిర్వర్తించారు. సౌమ్యుడిగా పేరొందిన ఆయన పోలీసు ఉన్నతాధికారిగానే కాకుండా శాస్త్రవేత్తగా కూడా పేరొందారు. కాంతిపుంజం అంశంపై పలు పరిశోధనలు చేశారు.
వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్‌రెడ్డి
హైదరాబాద్‌  :డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో సోమవారం ఆయన వీడ్కోలు వందనం స్వీకరించారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌ గ్రౌండ్స్‌లో పోలీస్‌ విభాగం కవాతు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా డీజీపీ దినేష్‌రెడ్డి మాట్లాడుతూ డీజీపీగా రెండేళ్ల మూడు నెలలు పనిచేశానన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.. అందరి సహకారంతో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకు వచ్చానని పేర్కొన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం గొప్పగా పనిచేస్తోందని తెలిపారు. తన పదవీకాలం పొడిగిస్తానన్న ప్రభుత్వం మాట తప్పిందని ఆయన ఆరోపించారు. కనీసం పై కోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం చేసిందన్నారు. తన పదవీకాలంలో శాంతిభద్రతలు కాపాడడానికి సహకరించిన పోలీసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు