తెలంగాణ ఏర్పడితే నీటి యుద్ధాలు జరగవు

కిరణ్‌కు బొత్తిగా అవగాహన లేదు
మంత్రి సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 1 (జనంసాక్షి) :
విభజన జరిగితే నీటి యుద్ధాలు జరుగుతాయన్న రాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శ న్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టులపై అనవసర వివాదాలు సృష్టించొద్దని, విభజన తర్వాత నీటి పంపకాల్లో ఎలాంటి సమస్యలు రావన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ఆలోచించే విభజన నిర్ణయం తీసుకుందన్నారు. మంగళవారం సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అనిల్‌తో కలిసి విూడియాతో మాట్లాడారు. నీటి ప్రాజెక్టులపై ఇటీవల సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని, నీటి యుద్ధాలు జరుగుతున్నాయని రెచ్చగొట్టేలా మాట్లాడడం సమంజసం కాదన్నారు. నీటి కేటాయింపులన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు కింద ఏ ప్రాంతానికి ఎంత మేరకు నీటిని కేటాయించాలనేది కేంద్ర జల సంఘం నిర్ణయిస్తుందన్నారు. ఏ ప్రాజెక్టు కింద సమస్యలు వస్తాయో అక్కడ కేంద్ర బోర్డు వస్తుందని, ఏ ప్రాజెక్టు కింద ఏ జిల్లాకు ఎంత నీరు కేటాయిస్తారో ఆ ప్రకారమే నీటి విడుదుల కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఎలా నీటి సరఫరా జరుగుతుందో అలాగే విభజన తర్వాత కూడా కొనసాగుతుందని తెలిపారు. విభజన వల్ల ఆంధ్ర రైతులకు ఎలాంటి నీటి సమస్యలు రావని తాను హావిూ ఇస్తున్నానని చెప్పారు. ఇప్పటికే కేటాయించిన నీటిని ఎక్కువ, తక్కువ చేసే అధికారం ఎవరికీ ఉండదన్నారు. కేటాయింపుల ఆధారంగానే అన్ని ప్రాంతాలకు నీటి విడుదల జరుగుతుందన్నారు. రాష్ట్ర విబజన జరిగిన తర్వాత రెండు రాష్టాల్ర మధ్య ఏర్పడే బోర్డు ఎలాంటి సమస్యలు లేకుండా నీటి కేటాయింపులు చేస్తుందన్నారు. కొందరు అవగాహన రాహిత్యంతో అనసవర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిఅవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. విూరు విూ ఇష్టం వచ్చినట్లు అనుకోండి అని బదులిచ్చారు. విభజన జరిగితే నీటి యుద్ధాలు వస్తాయన్నది అపోహ మాత్రమేననని.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సీఎం కిరణ్ వ్యాఖ్యలను తాను ఖండించడం లేదని, వాస్తవాలను వివరిస్తున్నానని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించనున్నందున అది ఇబ్బంది అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో అనవసర రాద్దాంతం చేయడం తగదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ఆలోచించే విభజన నిర్ణయాన్ని తీసుకుందనన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుందని, అన్ని సమస్యలకు మంత్రుల కమిటీ పరిష్కారం చూపుతుందన్నారు. తెలంగాణ నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పారు. త్వరలోనే తెలంగాణ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.



