హైదరాబాద్‌ పాకిస్తాన్‌ అన్నారుగా సభ ఎట్ల పెడుతవ్‌ ?


మహబూబాబాద్‌ పునరావృతం కావచ్చు
ద్రోహులను ద్రోహులుకాకపోతే ఏమంటం
– కేసీఆర్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) :
వైఎస్సార్‌ సీపీ నాయకురాలు షర్మిల హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిందని, మరి ఇప్పుడు ఆమె సోదరుడు వైఎస్‌ జగన్‌ ఇక్కడ సమైక్య సభ ఎట్ల పెడుతరని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖ ర్‌రావు ప్రశ్నించారు.  మంగళవా రం స్థానిక తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నేడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధాకరంగా ఉందని, తాను నోరుతెరిస్తే విష సంస్కృతి, సీమాంధ్రులు ఇతరులు చేస్తే మంచి సంస్కృతిగా కనిపిస్తోందా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  సీమాంధ్రకు చెందిన నేతలు తెలంగాణ వాదులను, ఉద్యమాన్ని ఇప్పటివరకు అనేకసార్లు దుర్బాషలాడినప్పుడు దత్తాత్రే య, నారాయణలు ఏమూలన కూర్చున్నారని నిలదీశారు.తనకు తెలుగు భాష రాదనుకోవడం వారి మూర్కత్వమే అవుతుందన్నారు. తాను తెలుగు లిటరేచర్‌ పూర్తి చేశానన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడాన్ని అడ్డుకునేవారిని దుర్మార్గులు అనకుండా ఇంకేమంటారో చెప్పాలని సవాల్‌ విసిరారు. బ్రిటీష్‌ వలసవాదులను ముష్కరులుగా పోల్చితే పాలకులందరిని తిట్టినట్లే అవుతుందా అన్నారు. లగడపాటి తెలంగాణను తాము అడ్డుకుంటున్నామని జబ్బలు చరుచుకుంటూ చెపుతుంటే ఎందుకు స్పందించరని కేసిఆర్‌ నిలదీశారు.అశోక్‌బాబు కొట్లాటకు రమ్మంటే మాత్రంఎందుకు స్పందించడం లేదన్నారు. పోలవరం నిర్మిస్తే గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆందోళనలు చేస్తుంటే, గిరిజనులను గోచీగాళ్ల కోసం ప్రాజెక్టు నిర్మాణం ఆపుతామా అంటూ కావూరి, రాయపాటితోపాటు సీమాంధ్ర నేతలంతా నోరు పారేసుకున్నప్పుడు ఏంచేశారన్నారు. తెలంగాణ ప్రజలు తామురాకుంటే ఇప్పటికి కూడా బానిసలుగానే కొనసాగేవారని పేర్కొంటుంటే ఆనందంగా ఉందా అన్నారు. తెలంగాణను సాయుధ పోరాటం ద్వారా విముక్తి కల్పించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇది వాస్తవం అయితే ఎందుకు వారిని నిలదీయలేదన్నారు. సీమాంధ్రలో రోజు జరుగుతున్న ఉద్యమంలో ఎన్నిసార్లు కేసిఆర్‌ను అవమానపరుస్తున్నారో కనిపించడం లేదా అన్నారు. జాతీయ నాయకురాలైన సోనియాను దుర్బాషలాడుతుండడం, ఫ్లెక్సీలకు వికృత రూపంలో వేషాలు వేస్తూ కాలపెడుతుంటే మాత్రం మంచి సంస్కృతిగా కనిపిస్తుందా అన్నారు. సమైక్యంగా ఉండాలనుకునేవారు చేసే చర్య లేనా అని సీమాంధ్రులను ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో సంయమనంతో వ్యవహరించాలని మౌనంగా ఉంటుంటే అది అసమర్థతగా బావించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆనాడు ఆనంరాంనారాయణరెడ్డి తెలంగాణ వాళ్లను రాక్షసులుగా తిడితే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఉస్మానియా విద్యార్థులను తాలిబన్లతో పోల్చినప్పుడు, కేసిఆర్‌ బొమ్మలను బాంబులతో పేల్చడం, పాములతో కరిపిస్తున్నప్పుడు ఎందుకువారిని అడ్డుకోవడంలేదన్నారు. తాను చాలాసార్లు సీమాంధ్ర నేతలను, ఉద్యమకారులను సంయమనం పాటించాలని కోరినా కూడా స్పందన రాలేదున్నారు. రాష్ట్రముఖ్యమంత్రి వెనక్కితిరుగడం అబద్దమా అని, టిడిపి యూటర్న్‌ తీసుకుని సీమాంధ్రలో బస్సుయాత్రలు చేస్తున్నది వాస్తవం కాదా అన్నారు. వచ్చిన తెలంగాణను అడ్డుకుంటున్న వారి విషయంలో ఎందుకు నిలదీయడం లేదని కేసిఆర్‌ ప్రశ్నించారు. తనకున్న సమాచారం ప్రకారం ఆరోతేదీలోగా సిఎం ప్లగ్‌ పీకేయడం ఖాయంఅన్నానే తప్పఎలా తీస్తారు, ఎవరు తీస్తారనేది కాలమేనిర్ణయిస్తుందన్నారు. కేంద్ర క్యాబినెట్‌కు ముందు ఏయేఅంశాలు చర్చకు వస్తాయనేది కనీతసం మంత్రి పిఏకు కూడా తెలియదన్నారు. తెలుసుకోవాలని మంత్రులు ప్రయత్నిస్తే తప్ప ఆ అంశాలు బయటకు రావన్నారు. త్వరలోనే ఏదైనా సాధ్యం కావచ్చన్నారు. దాన్నిచూస్తూ ఉండాలే తప్ప ఊహించుకోవడం సరైంది కాదన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసిన కొద్ది వైషమ్యాలు పెరుగుతూనే ఉంటాయన్నారు. ఇప్పటికైనా తాత్సారంమానివేసి తక్షణమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణను వైసిపి నేత చెల్లెలు షర్మిల పాకిస్థాన్‌తో పోల్చిన  విషయం వాస్తవం కాదా అలాగైతే ఇక్కడ సమావేశం ఎలా నిర్వహిస్తారని జగన్‌ను నిలదీశారు. పాకిస్థాన్‌లో సభ ఎలా నిర్వహిస్తారని కేసిఆర్‌ జగన్‌ను ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే అడ్డుకుంటామని, మహబూబాబాద్‌లో జరిగిన సంఘటనలు పునరావృతమవుతాయని తెలిపారు. పరకాల ఉపఎన్నికల్లో విజయలక్ష్మి చిలుకపలుకులు మాట్లాడింది మరిచిపోయారా అన్నారు. సకల జనుల భేరి వెయ్యిరెట్లు సక్సెస్‌ కావడం తో ప్రతిఒక్కరిలో గుబులు ప్రారంభ మైందన్నారు. తాను ఎవ్వరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు. అదే నిజమైతే గత 13ఏళ్లుగా ఉద్యమం ఎలాకొనసాగేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం తక్షణమే రాష్ట్ర ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. తెలంగాణ వచ్చేవరకు టిఆర్‌ఎస్‌ విశ్రమించబోదన్నారు. రాష్ట్రం కోసం ఉద్యమాన్ని అవసరమైతే ఉధృ తం చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నామన్నారు.

తాజావార్తలు