తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం


ప్రక్రియను వేగవంతం చేస్తాం
నోట్‌పై షిండేతో చర్చిస్తా
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. అమెరికా పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకున్న ఆయన విలేకరులతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకు స్పష్టమైన వైఖరి వుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ ఎజెండాలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి బయు దేరిన ప్రధాని మన్మోహన్‌ విలేకరులతో మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో సమావేశమై తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఆర్డినెన్స్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో తాను మాట్లాడుతానని మరో ప్రశ్నకు ప్రధాని సమాధానమిచ్చారు. రాహుల్‌ అలా మాట్లాడటానికి దారి తీసిన పరిస్థితులేమిటో అడిగి తెలుసుకుంటాను అని అన్నారు. అంతేకాక రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రధాని అన్నారు. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు అన్ని లౌకిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజావార్తలు