కిరికిరిలేని హైదరాబాదేకావాలి


మా నిజామే మస్తు అభివృద్ధి చేసిండు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తాం
హైదరాబాద్‌ ,అక్టోబర్‌ 5 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ విూద ఆంక్షలు పెడితే సహిం చేదిలేదని, ఎలాంటి కిరికిరి లేని హైదరాబాద్‌ కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోమారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ విూద ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ విూద ఆంక్షలకు ఒప్పుకుంటే భవిష్యత్‌ తెలంగాణ పౌరులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్‌ విషయంలో అవసరమైతే మరోసారి ఉద్యమానికి సిద్ధంకావాలని ఆయన పిలుపు నిచ్చారు. శనివారం విద్యుత్‌ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జంగ్‌ సైరన్‌’ సభలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్‌ విూద కిరికిరి పెడితే ఒప్పుకోం. హైదరాబాద్‌కు కూలీ కుతుబ్‌షా పునాది వేస్తే నిజాం ప్రభువులు అభివృద్ధి చేశారు. ఇవాళ సీమాంధ్రులు హైదరాబాద్‌ను మేం అభివృద్ధి చేశాం హైదరాబాద్‌ మాది అంటే ఊరుకోం’ అనిఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసేందుకు తాను ముందుండి పోరాడుతానని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులంటే శ్రమ దోపిడేనని పేర్కొన్నారు. పెడితే మంత్రులను, ముఖ్యమంత్రులను కాంట్రాక్టు విూద పెట్టాలిగానీ, చిన్నచితకా ఉద్యోగులను కాదని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగికి కనీసం ఈఎస్‌ఐ కార్డు కూడా ఉండొద్దా అని ప్రశ్నించారు. తెలంగాణ రాగానే విద్యుత్‌ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హావిూ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను పాలకులు కనీసం మనుషులని కూడా ఆలోచించరా? అని ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్‌ బోర్డు పెట్టుకునే అంశంపై చర్చించాలన్న కేసీఆర్‌ ఐదేళ్లలోపు తెలంగాణలో 15వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వస్తే చిరునవ్వుల తెలంగాణ కావాలి అని కేసీఆర్‌ అన్నారు. రాబోయే తెలంగాణలో అందరు చిరునవ్వులతో జీవించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనబై ఐదు శాతం మంది ఎస్సీ,ఎస్టీ, బీసీలున్నారని వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపడతామని స్పష్టం చేశారు. అగ్ర వర్ణాల్లో ఉన్న పేదవారిని కూడా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. ఈ ఉద్యమం ఇంతటిత ఆగిపోదని, ఇక ముందు కూడా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కొనసాగుతదని తెలిపారు. ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ కాస్మోపాలిటన్‌ నగరం. ఈనాడు కాదు నిజాం కాలం నుంచే ఇది కాస్మోపాలిటన్‌ సిటీగా ఉంది. ఇక్కడ అందరూ ఉన్నారు, ఉంటారు’ అని కేసీఆర్‌ అన్నారు. ‘హైదరాబాద్‌లో బాంబే బేకరీ ఉంది. కరాచీ బేకరీ ఉంది. చంద్రబాబుకు పాలు, కూరగాయల దుకాణం ఉంది. కిరణ్‌ కర్రీ పాయింట్‌ పెట్టుకుంటే తప్పేంటీ?’ అని అన్నారు. కర్రీ పాయింట్‌ కాకుంటే ఫైవ్‌ స్లార్‌ ¬టల్‌ కట్టుకోమనండి ఎవరొద్దన్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ రావడం శుభపరిణామని కేసీఆర్‌ అన్నారు. ఐటీఐఆర్‌ రావడం ఎవరి మెహర్బానీ కాదని స్పష్టం చేశారు. ప్రపంచ సీఈవోల సదస్సులో హైదరాబాద్‌ ఐటీ పెట్టుబడులకు అనుకూలమని తీర్మానం చేశారని తెలిపారు. హైదరాబాద్‌ భూకంపాలు రాకుండా, భూమి లభించే నగరంగా ఉందని వాళ్లు అన్నారని తెలిపారు. వాళ్లంతా ప్రపంచమంతా తిరిగి చివరికి హైదరాబాద్‌ తమకు అనుకూల ప్రదేశమని ఎన్నుకున్నారని వివరించారు. ఐటీఐఆర్‌ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 30 నుంచి 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ సిలికాన్‌ నగరంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రావాలంటే ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగొద్దని పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‘సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా’గా రూపుదిద్దుకుంటుందని వివరించారు. హైదరాబాద్‌ భారతదేశ సిలికాన్‌ వ్యాలీ కాబోతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఐటీఐఆర్‌ వస్తే అంతర్జాతీయంగా హైదరాబాద్‌ ఖ్యాతి ఇనుమడిస్తుందని, దీంతో మరిన్ని అనుబంధ సంస్థలు వస్తాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తాను ఒక్కడినే అని ఇప్పుడు యావత్‌ తెలంగాణ ఉద్యమంలో భాగమైందని ఆనందం వ్యక్తం చేశారు.

తాజావార్తలు