రాష్ట్ర విభజన అడ్డుకోలేం పిల్‌ కొట్టేసిన హైకోర్టు


హైదరాబాద్‌, అక్టోబర్‌ 8(జనంసాక్షి) :
రాష్ట్ర విభజనపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొ ట్టివేసింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోజాలమని తే ల్చి చెప్పింది. విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాన్‌జ్యోతిసింగ్‌, జస్టిస్‌ కేసీ భానులతో కూడిన ధర్మాసనం… వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఈ పిల్‌లో ఎలాంటి ప్రజాప్రయోజనాలు కనిపించడం లేదని, అందుకే కొట్టివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఆర్టికల్‌-3ను తొలగించాలన్న పిటిషనర్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను తొలగించడం, సవరించడం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఇవన్నీ పార్లమెంట్‌ చూసుకుంటుందని తెలిపింది. భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థ శాసనాలు చేస్తే.. వాటిని కార్యనిర్వాహకశాఖ అమలు చేస్తుందని వివరించింది. రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహిచంకపోతే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందని తెలిపింది.రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయవాది పీవీ కృష్ణయ్య ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని, ఆర్టికల్‌ 3ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌లో ప్రజా ప్రయోజనలు లేవని కొట్టివేసింది. ఆర్టికల్‌ 3ను సవరించే,  రద్దు చేసే అధికారం తమకు లేదని పేర్కొంది. రాజ్యాంగ సవరణ తమ పరిధిలోకి రాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవు.. వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఘాటైన వ్యాఖ్యాలు చేసింది. పత్రికల్లో తమ పేర్లు పెద్ద అక్షరాలతో రావాలనే ఉద్దేశ్యంతో ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేవలం క్యాబినెట్‌ నోట్‌ను ఆమోదించిన మాత్రాన విభజన ప్రక్రియ పూర్తయిపోలేదని ధర్మాసనం పేర్కొంది. విభజనపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని తెలిపిన న్యాయస్థానం.. రాష్టాల్ర ఏర్పాటు పార్లమెంట్‌  పరిధిలోనిదని, దానిపై తాము జోక్యం చేసుకోజాలమని స్పష్టం చేసింది.

తాజావార్తలు