టీ విద్యుత్‌ నేత రఘు దీక్ష భగ్నం


అప్రజాస్వామికం : కోదండరామ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి):
సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్‌ సమ్మె వల్ల సామాన్యప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రాంత విద్యుత్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ కోఆర్డినేటర్‌ రఘు విద్యుత్‌ సౌధలో చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన 48గంటల దీక్షను సోమవారం కూర్చున్నారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసిన సందర్భంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఇప్పుడు సీమాంధ్రలో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 48 గంటలు పూర్తికాక ముందే మంగ ళవారం ఉదయం పది గంటలకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని గాంధీఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉస్మానియాకు తరలించారు. అయితే, అరెస్టు చేసినా దీక్ష భగ్నంచేసేందుకు కుట్ర చేసినా తాను దీక్ష విరమించేది లేదని రఘు ప్రకటించారు. సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, యాజమాన్యం, ప్రభుత్వనిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాను ఈ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా తాను దీక్ష మాత్రం విరమించేది లేదని రఘు స్పష్టంచేశారు. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
రఘు అరెస్టు అప్రజాస్వామికం : కోదండరాం
హైదరాబాద్‌: ప్రజల ఇబ్బందులపై దీక్ష చేస్తున్న తెలంగాణ విద్యుత్‌ జేఏసీ నాయకులు రఘును అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ఖండించారు. ఆయన లేవనెత్తిన అంశాలను చర్చించకుండా అరెస్టు చేయడం దారుణమని అభివర్ణించారు.  ప్రజలకు విద్యుత్‌ అందించాలని, సబ్‌స్టేషన్‌లపై, గ్రిడ్‌లపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రఘు దీక్ష చేస్తుంటే ఆయనను ఎందుకు అరెస్టు చేయాల్సి వస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

తాజావార్తలు