భావోద్వేగతో మాట్లాడిన సచిన్‌

ముంబాయి: వాంఖడే స్టేడియంలో ముంబయి టెస్టు ముగిసిన అనంతరం సచిన్‌ భావోద్వేగంతో మాట్లాడారు. 22 గజాల పిచ్‌లో 24 ఏళ్లు గడపడం ఆనందంగా ఉందన్నారు. అనితర సాధ్యమైన రీతితో అభిమానాన్ని అందుకున్నానన్నారు. 11 ఏళ్ల వయస్సులోనే కష్టపడడం నేర్చుకున్నాని, అడ్డదారులు వెతుక్కోవద్దన్న శిక్షకుల సలహాలు పాటించానని సచిన్‌ తన అనుభవాలను వివరించారు. శారీరకంగా, మానసికంగా ఉండడానికి తన అమ్మే కారణమని, క్రీజులో ఉన్న ప్రతిసారి బాగా ఆడాలని ప్రార్థించేదని చెప్పారు. అమ్మ ప్రార్థనలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. అమ్మ అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. పెద్దన్నయ్య అజిత్‌ తనను ఎప్పుడూ ప్రోత్సహించేవారని, 11ఏళ్ల వయస్సులో కోచ్‌ అచ్రేకర్‌ వద్దకు అన్నయ్య తీసుకెళ్లారని సచిన్‌ గుర్తు చేసుకున్నారు. వూహ తెలిసినప్పటి నుంచి క్రికెట్‌ అంటే విపరీతమైన అభిమానం అని, తాను వాడిన తొలిబ్యాబ్‌ను.. సోదరి బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. క్రికెట్‌పై తనకు ఉన్న అభిమానమే ఇన్నేళ్లపాటు క్రికెట్‌ ఆడేలా చేసిందన్నారు. సచిన్‌ మాట్లాడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు కంటతడిపెట్టారు.