ఉసురు తీసిన రాయల తెలంగాణ

విద్యార్థి ఆత్మహత్య, మరొకరి హఠాన్మరణం
నిజాంసాగర్‌/కమాన్‌పూర్‌, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేంద్రం తెస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణవాదుల ఉసురు తీస్తోంది. ఓ విద్యార్థి కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకోగా, ఓ గీత కార్మికుడు గుండె పగిలి చనిపోయాడు. 10 జిల్లాల తెలంగాణే మాకు కావాలని, రాయల తెలంగాణ తమకు వద్దని సూసైడ్‌ నోట్‌ రాసి నిజామాబాద్‌ జిల్లా నిజాంసాగర్‌ మండలం అసన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మ రాములు (23) బీఎడ్‌ విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నాడు మండలంలో సంచలనం సృష్టించింది. కుర్మ రాములు బీఎడ్‌ పూర్తి చేసి టెట్‌ కోసం బాన్సువాడలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ అని ప్రకటన జారీ చేయడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి రాయల తెలంగాణలో మళ్లీ తమకు కష్టాలు తప్పవేమోనన్న బాధతో 10 జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని, హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచాలని, భద్రాచలాన్ని తెలంగాణలోనే కలపాలని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 7గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు కొడుకును లేపడానికి ప్రయత్నించగా జీవత్సవంలో పడి ఉండడంతో కొడుకు మృతి చెందాడని రోదిస్తుండడంతో చుట్టు ప్రక్కల వారు గమణించి ఇంట్లోకి తీసుకెళ్లి అతని చేతిలో ఉన్న సూసైడ్‌ నోట్‌ను చదివి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు గ్రామానికి తరలివచ్చి రాములు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు స్థానిక బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద రెండున్నర గంటల పాటు రస్తారోకో నిర్వహించారు. జోహార్‌ రాములు అన్న నినాదాలతో ప్రాంతం దద్దరిల్లింది. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న బోధన్‌ డీఎస్పీ గౌస్‌మొహినోద్దిన్‌ రస్తారోకో వద్దకు చేరుకొని ఎమ్మెల్యేకు నచ్చజెప్పి రస్తారోకోను విరమింపజేశారు.
గుండెపోటుతో గీత కార్మికుడు
కమాన్‌పూర్‌ : రాయల తెలంగాణ యోచన ఓ గీతాకార్మికున్ని బలి తీసుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్థానంలో రాయల తెలంగాణ ఏర్పాటు యోచన ప్రకటనను కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన బుర్ర శంకరయ్యగౌడ్‌(46) అనే గీతా కార్మికుడు టివి వార్తల్లో చూశాడు. ఈ వార్తను విన్న శంకరయ్యగౌడ్‌ ఒక్కసారిగా కూలాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో హుటాహుటినా శంకరయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యమంలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, శంకరయ్య మృతదేహానికి టిఆర్‌ఎస్‌ నాయకులు చందుపట్ల సునీల్‌రెడ్డి, మల్యాల రాంచందర్‌గౌడ్‌, గంట వెంకటరమణారెడ్డి, సత్తయ్యగౌడ్‌, రాజన్న తదితరులు నివాళులర్పించారు.