ఈ విజయం తెలంగాణ ప్రజలది
అమరులకు అంకితం : కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకొని బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం పది జిల్లాల ప్రజల విజయమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి తిరిగివచ్చిన ఆయన నేరుగా గన్‌పార్క్ వద్దకు చేరుకొని అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ బిల్లు తెచ్చుకోగలిగామని ఆయన అన్నారు. ఈ విజయం వారికే అంకితమన్నారు. ఎందరో త్యాగాలు, పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష సాకారం కాబోతోందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష గుర్తించిన యూపీఏకు అభినందనలు తెలిపారు. అయితే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేవరకు పోరాటం కొనసాగిస్తామని కోదండరామ్ చెప్పారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు శాంతియుత విభజనకు సహకరించాలన్నారు. రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. విబజన నిర్ణయం జరిగాక కూడా సీమంధ్రా నేతలు ఇంకా అడ్డుకుంటామని ప్రకటనలు చేయడం తగదన్నారు. ఇలాంటి ప్రకటనలతో సీమాంధ్ర ప్రజలను మభ్య పెట్టవద్దన్నారు. రాయల తలెంగాణకు వ్యతిరేకంగా తాము చేసిన పోరాటం ఫలించిందన్నారు. తెలంగాణ ప్రజలు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి విజయం సాధించేవరకూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని అన్నారు. ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు, నాయకులు ప్రయత్నించడంపై ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన తెలంగాణ ఏర్పాటు ఆగబోదని తేల్చిచెప్పారు.