రాష్ట్రానికి తెలంగాణ ముసాయిదా

ఆరు వారాల గడువిచ్చిన రాష్ట్రపతి
స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు బిల్లు పంపనున్న సీఎస్‌
సభలో తెలంగాణే హాట్‌ హాట్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన ముసాయిదా బుధవారం రాష్ట్రానికి చేరింది. ఈమేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ బిల్లు-2013ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి పంపారు. ఆయన ఈ బిల్లును శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు, శాసనమండలి చైర్మన్‌ చక్రపాణికి పంపుతారు. ఈ ముసాయిదాపై ఆరు వారాల్లోగా సమాధానమివ్వాలని రాష్ట్రపతి సూచించారు. నిర్దేశిత వ్యవధిలోగా బిల్లును తిప్పి పంపాలని సూచించారు. గురువారం నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారమే బిల్లు రాష్ట్రానికి పంపాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వేగంగా ముసాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా సంతాపసభలో పాల్గొనేందుకు జొహన్నెస్‌బర్గ్‌ వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్‌ షెడ్యూల్‌ ప్రకారం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా, ముసాయిదాపై నిర్ణయం తీసుకోవడానికే మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగివచ్చారు. ఇది వరకే తెలంగాణ ముసాయిదాపై న్యాయసలహా తీసుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ బిల్లును పరిశీలించి సంప్రదాయాల ప్రకారం అసెంబ్లీకి పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరిన బిల్లు గురువారం శాసనసభ, శాసనమండలికి చేరుతుంది. ఈనెల 20 వరకు జరుగనున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లో తెలంగాణపై హాట్‌ హాట్‌గా చర్చ జరుగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ డిమాండ్‌ చేస్తుండగా, కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కొందరు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే ప్రకటించారు. కొందరు మాత్రం రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ గ్రూపునకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం వహిస్తుండటం, కొందరు నేతలు అధిష్టానాన్నే ధిక్కరిస్తుండటంతో అందరి దృష్టి అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది.