అదృశ్య విమానంపై కొనసాగుతున్న గాలింపు


కూలిందా? హైజాకా?
జాడ కోసం ముమ్మరగాలింపు
కౌలాలంపూర్‌, మార్చి 9 (జనంసాక్షి) :
కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌ వెళుతూ అదృశ్యమైన విమానంపై మిస్టరీ వీడలేదు. మొదట అది సముద్రంలో కూలిపోయిందంటూ విశ్వసించిన వారు దాన్ని ఎవరో హైజాక్‌చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో విమానం కూలిపోతే 24 గంటలు గడిచినప్పటికీ దానికి సంబంధించిన ఆనవాలు, శకలాలు, మృతదేహాలు, కనీసం వాటి వస్తువులు, బ్యాగుల్లాంటివి నీటిపై తేలి ఉండాలి. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా లభ్యం కాకపోవడంతో విమానం హైజాక్‌కు గురైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం జాడ కోసం చైనా, బీజింగ్‌, వియత్నాం, అమెరికా దేశాలకు చెందిన సుమారు 22 విమానాలు, 40 ఓడలు రంగంలోకి దిగి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. విమానం ఆచూకీ కోసం ఇండోనేషియా సహకారాన్ని కూడా కోరామని ఆ దేశ రక్షణశాఖ మంత్రి తెలిపారు. 12 మంది సిబ్బందితో పాటు 227 ప్రయాణికులు ఉన్న ఈ విమానంలో ఇద్దరు వ్యక్తులు నకిలీ పాస్‌పోర్టు కలిగి ప్రయాణిస్తున్నట్లు ఆ దేశ విమానయాన సంస్థ పేర్కొంది. వీరేమైనా విమానాన్ని హైజాక్‌ చేసి ఉంటారా అని ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో ఎలాంటి శకలాలు లభించకపోవడంపట్ల విమానం తిరిగి వస్తుందన్న ధీమాను మలేషియా పౌరవిమాన సంస్థ ధీమా వ్యక్తంచేస్తోంది. 227 మంది ప్రయాణికుల్లో 152 మంది చైనావారు, 38 మంది మలేషియా, ఏడుగురు ఇండోనేషియన్లు, ఆరుగురు ఆస్ట్రేలియన్లు, ఐదుగురు భారతీయులు, ఒక శిశువుతో సహా నలుగురు అమెరికన్లు, ముగ్గురు ఫ్రెంచివారు, న్యూజిల్యాండ్‌, ఉక్రెయిన్‌, కెనాడా దేశాల నుంచి ఇద్దరేసి, రష్యా, ఇటలీ, తైవాన్‌, నెదర్లాండ్‌ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.