మునిసిపల్ ఫలితాలపై సుప్రీం తాత్కాలిక స్టే
విచారణ ఏడో తేదీకి వాయిదా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (జనంసాక్షి) :మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పులో 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. దీనిపై సమా ధానం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎక్కువ కాలం ఫలితాలు వెల్లడించకుండా ఉంచలేమని ఎన్నికల సంఘం పేర్కొనగా, ఎందుకు ఉంచ లేరని న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశం ప్రకారం ఏప్రిల్ 9న మున్సిపల్ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అదే రోజు ప్రకటించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సుప్రీంకు కూడా తెలిపింది. దీంతో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన తేదీపై మళ్లీ సందిగ్దత నెలకొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 9న ఫలితాలు వెలువడకపోయే అవకాశముంది. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించడంతో ఇప్పుడు ఫలితాల వెల్లడికి అవకాశం ఉంటుందా లేదా అన్నది సోమవారం తేలనుంది. సోమవారం వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఇసి నిర్ణయం తీసుకరోనుంది. ఈలోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఆంధప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పుడు దానిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. త్వరలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశముందని, కావున వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలను కూడా సాధరణ ఎన్నికల అనంతరం ప్రకటించాలని ఇటీవల తీర్పు వెలువరించిన విషయం విదితమే.