జల్.. జమీన్.. జంగలే తెలంగాణ పునాది
రెబల్స్ తప్పుకుంటారు
సీపీఐకి న్యాయం జరుగుతుంది
: జైరామ్ రమేశ్
ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) :
మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ, ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీలపై యూపీఏ సర్కారు ప్రకటించిన యుద్ధానికి సూత్ర ధారుల్లో ఒక్కరైన జైరామ్ రమేశ్ గురువారం అభినవ మావోయిస్టులా మాట్లాడారు. జల్.. జంగల్.. జమీనే తెలంగాణకు పునాదిగా అభివర్ణిం చారు. జల్.. జంగల్.. జమీన్‌పై హక్కుల కోసం మావోయిస్టుల నేతృ త్వంలో ఆదివాసీలు, గిరిజనులు, దళితులు సాగించిన ఉద్యమ పలు కులు జైరామ్ నోట రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదిలాబాద్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో
మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. త్వరలో తెలంగాణలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరామ్ శుక్రవారం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డిపై ఆయన వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎలా నామినేషన్ వేస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు రాక అసంతృప్తితో నామినేషన్లు వేసిన రెబల్స్ అంతా తప్పుకుంటారని, పొత్తు ధర్మాన్ని కచ్చితంగా పాటించి తీరుతామని చెప్పారు. సీపీఐ బరిలో నిలిచిన చోట కాంగ్రెస్ రెబల్స్ పోటీ చేయబోరని, ఆ పార్టీకి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.