కేసీఆర్‌, హరీశ్‌, విజయశాంతి ఆస్తులపై విచారణ


సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆస్తులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు ఆయన మేనల్లుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ విజయశాంతి ఆస్తులపైనా విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంఘానికి సూచించింది. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐ ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు విజయశాంతి, హరీశ్‌రావు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ న్యాయవాది బాలాజీ వడేరా గత వారం దాఖలు చేసిన ప్రైవేట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు తమకు తెలపాలని సూచించింది. ఉద్యమం పేరుతో పెద్ద సంఖ్యలో ముగ్గురు నేతలు భారీగా ఆస్తులు కూడబెట్టారని టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత రఘునందన్‌రావు చేసిన ఆరోపణల ఆధారంగా బాలాజీ వడేరా సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారించిన కోర్టు ముగ్గురి ఆస్తులపై విచారణకు ఆదేశించింది. కేసీఆర్‌, హరీశ్‌రావు, విజయశాంతి ఆస్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారని న్యాయవాది బాలాజీ వడేరా గతంలో హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, ఎలాంటి ఆధారాలు చూపనందున ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏవైనా ఆధారాలుంటే ముందుగా సీబీఐకి ఫిర్యాదు చేయాలని సూచించింది. పిల్‌ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు పిటిషనర్‌ గతేడాది ఆగస్టు 12న సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే, సీబీఐ కేసు నమోదు చేయకపోవడంతోనే సీబీఐ కోర్టును ఆశ్రయించానని ఆయన తెలిపారు. 2001కి ముందు నామమాత్రంగా ఉన్న కేసీఆర్‌ ఆస్తులు ఆ తర్వాత భారీగా పెరిగాయని బాలాజీ ఆరోపించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్‌, హరీశ్‌రావు, విజయశాంతి వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కృతుడైన రఘునందన్‌రావు గతంలో చేసిన ఆరోపణల ఆధారంగా ఆయన ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో చానల్‌ నిర్వహించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.