మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
18 మంది మృతి
రాయ్‌గఢ్, మే 4 (జనంసాక్షి) :మహారాష్ట్రలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 18 మంది మృతిచెందారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. రాయ్‌గఢ్ జిల్లాలో నాగొథానే – రోహా రైల్వు స్టేషన్ల మధ్య ఉదయం పది గంటల సమయంలో
ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దివా-సవంత్వాడీ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు నిది గ్రామ సమీపంలోని సొరంగమార్గం దాటగానే ఇంజిన్ సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. క్షతగాత్రులను రోహాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంకణ్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ రైల్వే అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గడిచిన నెలరోజుల్లో ఈ రైల్వే మార్గంలో ఇది రెండో ప్రమాదం. గతంలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఒక రోజంతా రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.10 వేల చొప్పున రైల్వేశాఖ నష్టపరిహారం ప్రకటించింది.