838 పంచాయతీలు ఏకగ్రీవం


24 చోట్ల నామినేషన్లే రాలేదు
కడప సీఐ సస్పెన్షన్‌
ఎన్నికల అధికారి నవీన్‌ మిట్టల్‌
హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి) :
రాష్ట్రంలోని 838 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, 26 పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేషన్‌ దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇందులో విశాఖపట్నంలో ఆరు, ఖమ్మంలో మూడు గుంటూర్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒకటి, ఆదిలాబాద్‌లో ఒకటి, వరంగల్‌లో మూడు, చిత్తూరులో మూడు, నెల్లూర్‌లో నాలుగు, విజయనగరంలో రెండు, పశ్చిమగోదావరిలో ఒకటి, కృష్ణాజిల్లాలో ఒక పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదని, ఇందుకు వివిధ కారణాలున్నాయన్నారు. రిజర్వేషన్లు అనుకూలించక పోవడమో, మావోయిస్టుల హెచ్చరికలతోనో ఈ సంఘటనలు జరిగినట్లు భావిస్తున్నామన్నారు. తిరిగి నోటిఫికేషన్‌ జారీచేసే విషయం గూర్చి ఆలోచిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో 838 పంచాయితీల్లో ఒక్కొక్క నామినేషనే దాఖలైందని, దీంతో వీటిని బుధవారం సాయంత్రం అధికారికంగా ఏకగ్రీవ పంచాయితీలుగా ప్రకటిస్తామన్నారు. అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి భార్య నామినేషన్‌ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న కడప సీఐ రమావతి అర్జున్‌ నాయక్‌ను సస్పెండ్‌ చేసినట్లు నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. అలాగే పాదయాత్రలు కోడ్‌ ఇల్లంఘన కిందకు రావన్నారు. అయితే ఎన్నికల నాటికి రెండు రోజుల ముందు ఈ చర్యలను మానుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ప్రత్యక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. గత నెలకంటే ఏ మాత్రం అమ్మకాలు పెరిగినా కూడా ఆవైన్‌ షాపులు, బార్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.