ఆర్మూర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి
ఆర్మూర్,అక్టోబర్ 5 ( జనం సాక్షి) : ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్భస్థ శిశువు మృతితో బాధితుల బంధువుల వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రూప్ల తండాకు చెందిన బాదావత్ మంజుల రెండవ కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. డెలివరీ తేదీ ఖరారు కావడంతో ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీసుకొని రిపోర్టులను వైద్య అధికారికి అందజేసింది. శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని వైద్యురాలు తెలిపిందన్నారు. బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్ళగా గర్బ స్త శిశువు మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలివచ్చి వైద్యులను నిలదీశారు. గర్భస్థ శిశువు మృతిచెందిన చెందిన విషయం ఎందుకు తెలుపలేదని వైద్యులను నిలదీశారు. గర్భస్థ శిశువు మృతి చెంది మూడు రోజులైనా విషయాన్ని తెలుపకపోవడం పట్ల వైద్యులపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి బంధువులను సముదాయించి గర్భస్థ మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.