వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్‌ఎస్ పంపిణీ

భీమదేవరపల్లి:ఏప్రిల్ 14 (జనం సాక్షి)వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు. మండలంలోని వంగర పీహెచ్‌సీ పరిధిలో ఆశా కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించడంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.కొప్పూరు గ్రామంలో ఏఎన్ఎం స్వరూప ఆశా కార్యకర్త కొమ్ముల రాణి ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రెహమాన్ మాట్లాడుతూ,ఎండ తీవ్రత అధికంగా ఉన్న వేళ అత్యవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే పలుచని కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవడం అవసరమన్నారు.అలాగే తరచూ నీరు లేదా ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవాలని.ఉపాధి పనుల్లో పాల్గొనే కూలీలు మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని సూచించారు.తలనిర్బంధం, వాంతులు,అలసట, ఛాతి నొప్పి వంటి వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.వంగర పీహెచ్‌సీలో ఓఆర్‌ఎస్ సాచెట్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ప్రజలు వాటిని వినియోగించుకోవాలని డాక్టర్ రెహమాన్ తెలిపారు.ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.