గుర్రంపోడు మండలంలో ‘అరైవ్ అలైవ్’ – పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గ్రామ సభలు
గుర్రంపోడు, ఏప్రిల్ 14, (జనంసాక్షి) :నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వాయి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలోఅధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా స్థానిక ఎస్సై వెంకన్న మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు అధిక శాతం నిర్లక్ష్యం, అతివేగం,ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రతి వాహనదారుడు హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహన పత్రాలను సక్రమంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం చేయరాదని సూచించారు. గ్రామ స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీల సహకారంతో పాఠశాలలు, కళాశాలల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు రోడ్డు భద్రత గ్రామసభలను నిర్వహించి, రోడ్డు సేఫ్టీ కమిటీలను నియమించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్. కరుణశ్రీ, మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ, స్థానిక సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, ఉప సర్పంచ్ మంచికంటి ప్రసాద్, పంచాయితీ కార్యదర్శి సైదులు, స్థానిక ప్రజలు, యువత మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


