చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్

మండలంలో జోరందుకున్న ప్రచారం…

చెన్నారావుపేట, మార్చి 10( జనం సాక్షి): చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నట్లు తెలిసింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఫిబ్రవరి 26వ తేదీన చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత రెడ్డి, ఆమె భర్త బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి కంది కృష్ణ చైతన్య రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు జున్నుతుల మహేందర్ రెడ్డిలను బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్నె వెంకన్న సస్పెన్షన్ చేశారు.ఈ నేపథ్యంలో చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేతరెడ్డి భర్త కృష్ణ చైతన్య రెడ్డి, జున్నుతుల మహేందర్ రెడ్డి లు కొంతమందితో కలిసి మార్చి 1వ తేదీన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాని చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేతరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరకుండా దూరంగా ఉన్నారు. గ్రామ సర్పంచ్ చేరకుండా ఆమె భర్త కృష్ణ చైతన్య రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుని చేరడంతో పలు విమర్శలు లేవనెత్తాయి. గ్రామ సర్పంచ్ కంది శ్వేతరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉండడంతో ఆమె పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ శ్వేతరెడ్డి పై రెండు మూడు రోజుల్లో బిఆర్ఎస్ మండల నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సస్పెన్షన్ ను ఎత్తి వేయనన్నట్లు చెన్నారావుపేట మండలంలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఏది ఏమైనా బిఆర్ఎస్ నాయకులు చెన్నారావుపేట సర్పంచ్ శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ను ఎత్తివేస్తారా… ఎత్తివేయరా…అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా జరిగే పరిణామాలపై వేచి చూడాల్సిందే మరి..!

తాజావార్తలు