డాబా పై నుండి పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు

పరిస్థితి విషమం…
హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స…
చెన్నారావుపేటలో చోటు చేసుకున్న సంఘటన…
చెన్నారావుపేట, ఫిబ్రవరి 27( జనం సాక్షి): డాబా పై నుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం… మండలంలోని పాత ముగ్దుంపురం గ్రామానికి చెందిన ననుమాస కిరణ్ కుమార్- భాగ్య దంపతుల కుమారుడు ననుమాస వంశీ హైదరాబాద్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రోజు తన పెద్దనాన్న ననుమాస కళాధర్ కూతురు వివాహం ఉండడంతో పాత ముగ్దుంపురం గ్రామానికి వచ్చాడు. గురువారం పొద్దంతా తన బంధుమిత్రులతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నాడు. రాత్రి పెళ్లి ఊరేగింపు పూర్తయ్యాక తన పెద్దనాన్న ననుమాస అశోక్ చెన్నారావుపేటలో జున్నుతుల రామ్ రెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్న నివాసంలోని డాబా పై పడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున మలమూత్ర విసర్జనకు లేచి బయటకి రాగా ప్రమాదవశాత్తు డాబా పై నుండి జారి కింద పడ్డాడు. దీంతో అతని తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. తెల్లవారుజామున చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.



