జర్నలిస్టుల భద్రతకు హెల్మెట్ రక్ష జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

 

 

 

 

 

 

మాడుగులపల్లిలో వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ

మాడుగులపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 25 జనం సాక్షి:సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టులు తమ ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. బుధవారం మాడుగులపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సై కృష్ణయ్య ప్రత్యేక చొరవతో, మాడుగులపల్లి సర్పంచ్ అరూరి నరేష్, ఆగా మోత్కూర్ సర్పంచ్ అండం రేణుక యాదయ్యల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మండల పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు నిరంతరం ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుంటారని, అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాల నుండి హెల్మెట్ ప్రాణ రక్షణ కవచంలా నిలుస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల క్షేమాన్ని కాంక్షించి, ఎస్సై కృష్ణయ్య సమన్వయంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్మెట్లు అందజేసిన సర్పంచులు అరూరి నరేష్, అండం రేణుక యాదయ్యలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
పోలీస్ శాఖ, సర్పంచుల చొరవకు అభినందనలు
జర్నలిస్టుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల మండల జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ వృత్తి పట్ల గౌరవంతో ఈ రక్షణ కవచాలను అందించినందుకు ఎస్సైకి, సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రాజశేఖర్ రాజకుమార్, సీఐ పీఎండి ప్రసాద్, స్థానిక పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వివిధ పత్రికలు విలేకరులు దర్శనం రాంబాబు, గంట రవి, చిట్యాల సైదులు, నాగరాజు, బొంగరాల శ్రీనివాస్, చెరుకుపల్లి రాజు, గంట సైదులు ,పెరమళ్ళ శ్రీనివాస్, భరత్, కట్ట ఏసన్నా రెడ్డి,అఫ్జల్, రామకృష్ణ,గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.