ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం మాడుగులపల్లిలో పెట్రోల్, డీజిల్ కరువు

బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
అర్థరాత్రి నుంచే క్యూ లైన్లలో వాహనదారులు
తీవ్ర ఇబ్బందుల్లో సామాన్యులు, రైతులు
మాడుగులపల్లి, ఏప్రిల్ 28( జనం సాక్షి):రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఉన్నతాధికారులు ఒకవైపు ప్రకటనలు జారీ చేస్తుంటే, మాడుగులపల్లి మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
మండల కేంద్రంలోని ఏదైనా ఒక బంకులో స్టాక్ ఉందని తెలియగానే వినియోగదారులు అక్కడికి పరుగులు తీస్తున్నారు ఇంధనం కోసం అర్థరాత్రి నుంచే వాహనదారులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది తెల్లవారేసరికి వందలాది వాహనాలతో బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు గంటల తరబడి వేచి చూసినా చివరకు తమ వరకు వచ్చేసరికి స్టాక్ అయిపోతుండటంతో వినియోగదారులు తీవ్ర నిరాశకు, అసహనానికి గురవుతున్నారువ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమున్న రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు అధికారులు కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో బంకు యాజమాన్యాలు స్టాక్ లేదని చెప్పడం వెనుక ఏదైనా మతలబు ఉందా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి కృత్రిమ కొరత ఏర్పడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారుమండల కేంద్రంలో ఇంధన సరఫరా అస్తవ్యస్తంగా మారుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మాడుగులపల్లి మండల కేంద్రంలోని బంకులకు నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, కృత్రిమ కొరత లేకుండా పర్యవేక్షించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



