మాతాశిశు ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

కౌన్సిలర్ రామతీర్థపు మాధవి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 10 (జనంసాక్షి) మాతాశిశువుల సంక్షేమంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కౌన్సిలర్ రామతీర్థపు మాధవి ఆరోపించారు.మంగళవారంవేములవాడలోని 9 వార్డులో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాశన, గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలను మున్సిపల్ మాజీ చైర్మన్, కౌన్సిలర్ రామతీర్థపు మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతాశిశువుల సంక్షేమం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాతాశిశు ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఉండేవని,ఆడబిడ్డ పుడితే రూ 13 వేలు,మగబిడ్డ పుడితే రూ 12 వేల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేదని ఆమె గుర్తు చేశారు.కానీ నేడు ఆ ఆర్థిక భరోసా ఎక్కడా కనిపించడం లేదన్నారు.అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూనే, ప్రభుత్వం ఇప్పటికైనా మాతాశిశు సంక్షేమంపై దృష్టి సారించాలని, గతంలోని సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమములో అంగన్వాడీ టీచర్ లత,ఎఎన్ఎం సృజన, ఆశ వర్కర్ లతా, పాల్గొన్నారు.

తాజావార్తలు