అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన

 

 

 

 

 

 

 

భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ అత్యుత్తమ ప్రతిభ…

హర్షం వ్యక్తం చేసిన తిమ్మరాయిని పహాడ్ గ్రామస్తులు…

చెన్నారావుపేట, మార్చి 10 ( జనం సాక్షి ): అమెరికా దేశంలో చర్మ వ్యాధుల రంగంలో భారతీయ శాస్త్రవేత్త, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయిని పహాడ్ గ్రామానికి చెందిన డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ గొప్ప పరిశోధన చేపట్టి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలువురి మన్ననలను పొందింది. అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలోని యూటి సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ లో చర్మవ్యాధుల రంగంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి పరిశోధనలో మెడికల్ సైంటిస్ట్ నాగోతు మరియ సింధూర జాన్ కీలక పాత్ర పోషించి ప్రపంచ వైద్య రంగాన్ని కదిలించింది. ఈ పరిశోధన ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్ నేచర్ మైక్రో బయాలజీలో ప్రచురించబడింది. ఇది ప్రపంచంలో అత్యున్నత స్థాయి పరిశోధన పత్రికలలో ఒకటిగా ఉండడం విశేషం . ఈ సంచలన పరిశోధనలో ఈమె కీలక పాత్ర పోషించడం ప్రతి భారతీయ పౌరుడికి గర్వకారణంగా చెప్పవచ్చు. పురుషుల్లో సాఫ్ట్ చర్మ ఇన్ఫెక్షన్లు ఎందుకు తీవ్రంగా ఉంటాయో శాస్త్రీయంగా నిరూపించారు. అంతేకాక టెస్టోస్టెరాన్ హార్మోన్ బ్యాక్టీరియా వైరులెన్సును పెంచుతుందని గుర్తించారు. ఎం ఆర్ ఎస్ ఏ వంటి ప్రమాదకర ఇన్ఫెక్షన్లపై కొత్త అవగాహనను చూపెట్టి ఈఎన్ టి- టి ఆధారిత కొత్త చికిత్స మార్గానికి బాటలు వేస్తూ ఈ పరిశోధన భవిష్యత్తులో వేలాది మంది పిల్లలు, రోగులకు ప్రాణాంతక చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే విధంగా చర్మవ్యాధుల రంగంలో పరిశోధన చేపట్టినట్లు డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ తెలిపారు. ఈ సందర్భంగా చర్మ వ్యాధుల రంగంలో నాగోతు మరియ సింధూర జాన్ కీలక పాత్ర పోషించి పరిశోధన చేపట్టి పలువురి మన్ననలు పొందడం పట్ల అమెరికాలోనే నివాసముంటున్న ఆమె భర్త నాగోతు జోసఫ్ అమృత రాజ్, ఆమె కుటుంబ సభ్యులు, తిమ్మరాయిని పహాడ్ గ్రామస్తులు, బంధువులు అభినందించారు.

తాజావార్తలు