ప్రజాపాలనతో పేదల ఇళ్లు సాకారం

` ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఆత్మగౌరమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి
` కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం
` ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నిలబడతాం
` మా సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాల దుష్ప్రచారం
` ` ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్క ఏడాదిలో రూ. 22 వేల కోట్లు ఖర్చు చేయడం దేశంలోనే ఓ రికార్డు
` పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడి వరకు సంక్షేమ పథకాలు
` ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి
మధిర(జనంసాక్షి):ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి, కుట్రలు పన్నుతున్నాయి… ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం నిటారుగా నిలబడి పని చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం మధిరలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్దిడి వరకూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం కేవలం ఏడాదిన్నర కాలంలోనే అందించాం అన్నారు. ప్రజల అవసరాలను ఓట్లుగా మార్చుకొని గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు వారి అవసరాలు తీర్చుకున్నారు తప్ప ప్రజల ఇబ్బందులు తీర్చలేదని డిప్యూటీ సీఎం ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు కూడా మంజూరు చేయలేదని, పాలకులుగా విలాసవంతమైన జీవితాలు గడిపారు రాష్ట్రం పై పడి దోచుకున్నారు తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదు అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు 10 సంవత్సరాల పాలనా కాలంలో పేదలకు ఇల్లు కడితే ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడేది కాదు అన్నారు. పది సంవత్సరాలు ఈ రాష్ట్రంపై పడి దోచుకుంది కాక రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, వారు తెచ్చిన అప్పులకు పది సంవత్సరాల తరువాత చెల్లింపులు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈరోజు వారు తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరదని డిప్యూటీ సీఎం వివరించారు. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని యావత్‌ క్యాబినెట్‌ రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ రూపాయి రూపాయి పోగు చేసి ప్రతి పైసా పేదల కోసం ఖర్చు పెడుతున్నాం అన్నారు. గత దశాబ్ద కాలంగా ఇళ్ల కోసం పేదవారు కళ్ళు కాయలు కాసేలా చూసిచూసి అలసిపోయారు, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే ఇంటి కల నిజమవుతుందని ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కో ఇంటినీ 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇళ్లను ఈ ఏడాది నిర్మిస్తున్నాం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మొదటి ఏడాది 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం పేదల ఇళ్ల కోసం ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని తెలిపారు. మనసున్న ప్రభుత్వం పేదల బాధలను అర్థం చేసుకొని, కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలు నాయకులకు మాత్రమే కాకుండా నిజమైన పేద వాళ్ళందరికీ ఇల్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం ఒక్క రోజులో తీసుకుంది కాదు అన్నారు,ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి కొన్నిచోట్ల పాదయాత్ర మరికొన్ని చోట్ల బహిరంగ సభలు నిర్వహించగా, ప్రతిపక్ష నేతగా తాను ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు నాలుగు నెలలపాటు పీపుల్స్‌ మార్చి పేరిట నడివేసవిలో సుదీర్ఘ పాదయాత్ర చేశానని ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేక పేదలు పడుతున్న బాధలు గుర్తించి నిజమైన పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడం అనేది ఓ సుదీర్ఘ కల, కొద్దిమంది ఈ కల నెరవేరకుండానే ప్రాణాలు కోల్పోయారు అని డిప్యూటీ సీఎం తెలిపారు. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని పేదవారు ఏ ఒక్కరూ ఉండకూడదని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేందుకు ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ఇల్లు లేని పేదలు, కూలీలు తాత్కాలిక నివాసాలకు కిటికీలు, తలుపులు లేకుండా పడిన ఇబ్బందులను పాదయాత్ర సమయంలో తన చేయి పట్టుకుని చూపించిన ఉదంతాలను తాను ఇంకా మరవలేదు అన్నారు. తలుపులు కిటికీలు లేక బడికి పోయిన బిడ్డ కోసం వండిన అన్నాన్ని కుక్కలు తిని పోయిన దయనీయమైన పరిస్థితులను తన పాదయాత్ర సమయంలో పేదలు వివరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.ప్రజల అవసరాల ఎ జెండాగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుంది రాష్ట్రంలో కోటి 12 లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నాం అన్నారు. రేషన్‌ బియ్యం వండుకునేందుకు పేదల కోసం 500 కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామని, పేదవారిపై భారం పడకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ పంపిణీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్న పని చేసుకునే ఓపిక ఉన్న వారి కోసం ఉపాధి కార్డు ఇచ్చి 100 రోజుల పని కల్పిస్తున్నాం, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే రెసిడెన్షియల్‌ విద్యార్థులకు 40 శాతం డైట్‌ 200 శాతం కాస్మోటిక్స్‌ చార్జీలు పెంచామని తెలిపారు. కాలేజీలకు వెళ్లే పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం, చదువు పూర్తి చేసుకున్న వారి కోసం 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. చదువుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రాక శక్తి, ఆసక్తి ఉన్న యువత కోసం 8,000 కోట్లతో రాజీవ్‌ యువ వికాసం అనే స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువస్తున్నాం అని డిప్యూటీ సీఎం అన్నారు. ఇంట్లో వారికి ఆరోగ్యం బాగా లేకపోతే 10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాన్ని ప్రజా ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. రైతులు పండిరచిన పంటకు మద్దతు ధర తోపాటు సన్న ధాన్యం పండిరచిన రైతులకు బోనస్‌ కింద క్వింటాకు 500 రూపాయలు చెల్లిస్తున్నాం అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశాం ఇందుకోసం 21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రుణమాఫీ తో పాటు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం సీజన్‌ కు 6,000 చొప్పున 12 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం, ఈ వానాకాలం సీజన్‌ కు తొమ్మిది రోజుల వ్యవధిలోనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రైతు భరోసా కోసం నేటి వరకు 17,500 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. మహిళలను మహారాణులుగా కొలవాలని మన నాగరికత, సంస్కృతి చెబుతుందనీ డిప్యూటీ సీఎం అన్నారు. మహిళల కోసం ఇందిరా క్రాంతి పదం ద్వారా డ్వాక్రా సంఘాలకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరం 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాం ఐదు సంవత్సరాల కాలంలో కనీసం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలిపారు.