ఇసుక అక్రమ రవాణాలను ప్రశ్నించినందుకు జీవచ్ఛవాలుగా మార్చారు

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి)
ఏడున్నరేళ్లుగా వారికి న్యాయం ఎండమావిగానే మారింది. జీవచ్ఛవంగా మారిన శరీరంపై ఇప్పటికీ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. పనిచేసేందుకు కూడా పనిరాకుండా మార్చిన మమ్మల్ని ఆదుకోండంటూ బాధితులు నేటికీ వేడుకుంటూనే ఉన్నారు. పోలీసుల దాష్టీకంతో లాఠీ కింద నలిగిన ఆ ‘బలహీనులు’.. బతుకంతా భారంగానే నెట్టుకొస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమాలను ప్రశ్నించడమే వారు చేసిన పాపమన్నట్టు.. ఒక్క ప్రాణం తప్ప మిగిల్చారు తప్ప కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. ఈ దుర్మార్గంపై ఇంకా న్యాయం పోరాటం చేస్తున్న బాధిత బహుజనులు.. రేవంత్‌ రెడ్డి సర్కారులోనైనా తమకో దారి దొరుకుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నేరెళ్ల బాధితులకు దొరకని న్యాయంగానే మిగిలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో నుండి సహజ సంపద అయిన ఇసుక యదేచ్చగా తరలిపోతున్న కాలమది. చివరకు ఇసుక లారీలు కూడా మనుషులను తొక్కేసిపోతున్న పరిస్థితి. అప్పటికే నలభై మందికిపైగా వాహనదారులు, పాదచారులను లారీలు ఢీకొట్టగా.. అందులో నలుగురు మరణించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన నేరెళ్ల గ్రామస్తులు సామూహికంగా ఇసుక లారీలను అడ్డగించి నిప్పు పెట్టారు. లారీల కింద నలిగిపోతున్న దరిమిలా ఆవేశంలో చేసిన ఆ ఘటనే వారిని ఇప్పటికీ వేధిస్తోంది. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిప్పుతోంది. అయితే, పనిచేస్తే గానీ రోజు గడవని ఆ బహుజనులు న్యాయం కోసం వ్యయప్రయాసలకు లోనవుతుండటం బాధిస్తోంది. 2017 జులై 2 నుంచి జులై 7 వరకు (ఈ ఐదురోజుల వ్యవధిలో) జరిగిన ఘటనలు గుర్తుచేస్తేనే వారు ఉలిక్కిపడుతున్నారు.
8 మందికి నరకం..!
లారీలను దహనం చేశారనే కేసులో 8 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇంకో ఐదుగురిపైనా కేసులు పెట్టారు. అరెస్ట్‌ చేసినవారిని దాదాపు నాలుగైదు రోజులు చిత్రహింసలు పెట్టారు. వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం చేయడంతో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని చూసి జైలర్‌ కూడా రిమాండ్‌కు నిరాకరించారు. తదనంతరం బాధితులకు ప్రత్యేక చికిత్స కోసం కోర్టు కూడా బెయిల్‌ మంజూరు చేసింది. మొత్తం ఈ ఘటన తీరుపై స్పందించిన పౌర సమాజం నివ్వెరబోయింది. బాధితులకు అండగా ప్రజాసంఘాలు, పౌర హక్కుల నేతలు ఆందోళనలకు దిగారు. అయితే, ఐదు రోజుల తర్వాత వారిని అరెస్ట్‌ చేయడంపైనా తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల చేతిలో చిత్రవధలకు గురైనవారు తమ పరిస్థితిపై ఫిర్యాదు చేసినా స్వీకరించలేదంటే ఎంత వివక్ష చూపారో తెలుస్తోంది. ఏడున్నరేళ్లుగా న్యాయం కోసం ఎందరిని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత సర్కారు హామీనిచ్చినా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. ఇప్పటికీ అనారోగ్య పరిస్థితులతో కుటుంబాన్ని పోషించలేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చేసిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ కూడా చేయలేదని, పోలీసులు పెట్టిన కేసులు మాత్రం నడుస్తున్నాయని నేరెళ్ల బాధితుడు కోల హరీష్‌ తెలిపారు. ఇటీవల ఆరోగ్యం దెబ్బ తినడంతో వెన్నుపూసకు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందని, మరో రెండు ఆపరేషన్లు చేయాల్సి ఉందని బాధితుడు పెంట బాలయ్య రోదిస్తూ తెలిపారు.
నేరెళ్ల ఘటనపై ఆనాడు భరోసానిచ్చిన కాంగ్రెస్‌
2017లో జరిగిన నేరెళ్ల ఘటనపై ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆనాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమారితో పాటు పలువురు నాయకులు నేరెళ్ల గ్రామాన్ని సందర్శించారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేసింది. అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి, నాటి పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు నేరేళ్లకు వెళ్లి బాధితులకు, వారి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కూడా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయకులు, ప్రజాసంఘాల డిమాండ్ల మేరకు బాధితులను కొట్టిన ఎస్సై రవీందర్‌ను సస్పెండ్‌ చేయడం, ఎస్పీ విశ్వజిత్‌ కంపాటీని బదిలీ చేయడంతో సరిపెట్టారు. ఆ ఇద్దరితో పాటు ఇతర కానిస్టేబుళ్లపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, శిక్షపడితేనే మాకు సరైన న్యాయం జరిగినట్టవుతుందని బాధితులు కోరుతున్నారు.
సావాల్నా బతుకల్నా.. : పెంట బానయ్య. నేరెళ్ల బాధితుడు
పెయ్యనిండా దెబ్బలున్నాయి. పానం పురాగా కరాబ్‌ అయింది. 15 రోజుల కిందనే వెన్నుపూసకు ఆపరేషన్‌ అయింది. కాళ్లకు ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెబుతుండ్రు. చేతిలో పైసలు లేవు. ఒక్క ఆపరేషన్‌ అప్పులు చేసి చేపించుకున్న. రెండు ఆపరేషన్లకు పైసలు ఎక్కడి నుంచి తేవాలే. కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలే.
సీఎం రేవంత్‌ రెడ్డి న్యాయం చెయ్యాలె : కోల హరీష్‌. నేరెళ్ల బాధితుడు
గత ప్రభుత్వం మా బతుకులతో ఆడుకున్నది. ఎందుకు పనికి రాకుండా చేసింది. ఇంతవరకు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ మాకు అండగా నిలబడ్డది. మమ్మల్ని హింసించిన పోలీస్‌ అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలే. దయనీయ స్థితిలో ఉన్నాం. మా కుటుంబాలను ఆదుకోవాలె.
ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణం : మార్వాడి సుదర్శన్‌, దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ నాయకులు
దళితులపై దాడులకు పాల్పడిన నేరెళ్ల ఘటనకు పూర్తిగా ఆనాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణం. ప్రభుత్వ ప్రోత్బలంతోనే పోలీసు అధికారులు బాధితులను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా ఆనాటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి.

తాజావార్తలు