అమానవీయం చెత్తకుప్పలో నవజాత శిశువు మృతదేహం

జడ్చర్ల, మే 1 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలో అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి ఒడిలో ఉండాల్సిన పసికందు, పుట్టిన గంటల్లోనే నిర్దయగా చెత్తకుప్ప పాలైన వైనం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ గుట్ట సమీపంలో ఉన్న ఒక చెత్తకుప్పలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడశిశువును పడేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం కాలనీకి చెందిన కొందరు చిన్నారులు అక్కడ క్రికెట్ ఆడుతుండగా, మృతి చెందిన శిశువు మృతదేహం వారికి కనిపించింది. గమనించిన పిల్లలు వెంటనే కాలనీవాసులకు సమాచారం అందించారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, చెత్తకుప్పలో పడి ఉన్న ఆ చిన్నారి మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. శిశువు యొక్క రెండు కాళ్లను కుక్కలు పీక్కుతిన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో జడ్చర్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.