జర్నలిస్ట్ కూరకుల గోపి మృతి పట్ల మంత్రి పొంగులేటి దిగ్భ్రాంతి
ఖమ్మం : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, ‘జనంసాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి, సీనియర్ జర్నలిస్ట్ కూరకుల గోపి ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గోపి మరణవార్త తెలుసుకున్న మంత్రి పొంగులేటి తీవ్ర విచారాన్ని వ్యక్తపరుస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిజం రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోపి మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని, శోకసంతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జర్నలిస్ట్ గోపి కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.



