ఏపీకి మేలు చేసేలా కేసీఆర్ కుట్ర
` పదేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేది
` అపెక్స్ కౌన్సిల్ భేటీ కుట్రపూరితంగా వాయిదా
` పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి నీళ్లు భారీగా తరలించుకుపోతున్నారు
` రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే శ్రీశైలం,నాగర్జునసాగర్‌ల ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం..
` పవర్‌పాయింట్‌ప్రజంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ వివరణ
హైదరాబాద్(జనంసాక్షి):2020లో ఏపీకి మేలు చేసేలా కుట్ర పూరిత చర్యలు చేపట్టారు. అపెక్స్ కౌన్సిల్ భేటీని గత ప్రభుత్వం కుట్రపూరితంగా వాయిదా వేసింది.
హైదరాబాద్: గత పదేళ్లలో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.కానీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెటేషన్ ఇచ్చారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘’1976లో బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేసింది. మూడు రాష్ట్రాలకు 2130 టీఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఏపీ 811, కర్ణాటక 734, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించింది. బచావత్ ట్రైబ్యునల్ తర్వాత కేంద్రం ఆమోదం లేకుండా ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు చేపట్టారు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిరడి, పాలమూరు-రంగారెడ్డి, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టులు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో 261 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపట్టినా పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టులు గత పదేళ్లలో పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో న్యాయం జరిగేది.ఏపీ సామర్థ్యాన్ని పెంచుకుందిఆల్మట్టి ప్రాజెక్టుపై ఉమ్మడి ఏపీ హయాంలో సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. తెలంగాణకు 575 టీఎంసీలు ఇవ్వాలని బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించాం. ఏపీకి 236 టీఎంసీలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదించింది. గత ప్రభుత్వం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని చెప్పింది. 2016లో అపెక్స్ కౌన్సిల్‌కు 66:34 శాతంపై లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. 2025 మార్చిలో తెలంగాణకు 71శాతం కృష్ణా జలాలు ఇవ్వాలని లేఖ రాశాం. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో ఎక్కువ అన్యాయం జరిగింది. మల్యాల సామర్థ్యాన్ని 3850 నుంచి 6300 క్యూసెక్కులకు పెంచారు. 2017లో రాయలసీమకు రోజూ 1.09 టీఎంసీలు తీసుకొనే సామర్థ్యాన్ని ఏపీ పెంచుకుంది.2020లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల నుంచి 92వేల క్యూసెక్కులకు ఏపీ పెంచుకుంది. జగన్ హయాంలో గోదావరి, కృష్ణా జలాలపై ప్రగతి భవన్‌లో చర్చించారు. శ్రీశైలం నుంచి ఏపీకి అక్రమంగా కృష్ణా జలాల తరలింపునకు పునాదులు పడ్డాయి. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే శ్రీశైలం, సాగర్ అవసరాలపై వినాశన ప్రభావం ఉంటుంది. నాగార్జునసాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. 2020లో ఏపీకి మేలు చేసేలా కుట్ర పూరిత చర్యలు చేపట్టారు. అపెక్స్ కౌన్సిల్ భేటీని గత ప్రభుత్వం కుట్రపూరితంగా వాయిదా వేసింది. రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యాక అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరయ్యారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయక ముందే హాజరైతే బాగుండేది. రాయలసీమ టెండర్లపై కేంద్రం స్టే విధించేలా చర్యలు ఉండేవేమో. రాయలసీమ లిఫ్ట్ టెండర్ల ప్రక్రియ పూర్తికి గత ప్రభుత్వం సహకరించింది. 2019కి ముందే పాలమూరు పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి న్యాయం జరిగేది’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.