ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ దౌర్జన్యం జనం సాక్షి కథనంపై అరకొర స్పందన

మాడుగులపల్లి,మే 03 (జనం సాక్షి) నిబంధనలు గాలికే పర్యవేక్షణ అటకెక్కి కాంట్రాక్టరే సుప్రీం అన్నట్లుగా మాడుగులపల్లి మండలం ఇందుగులలో రోడ్డు నిర్మాణం సాగుతోంది ఇటీవల ఈ రోడ్డు పనుల్లో వనపర్తి జిల్లా చిన్నారుల శ్రమ దోపిడీపై ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు, హడావిడి చేసి బాల కార్మికులను పనుల నుండి పంపించి వేశారు అయితే, అసలు రోడ్డు నాణ్యత విషయంలో జరుగుతున్న ఘోరమైన అవినీతిని మాత్రం అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.సిసి రోడ్డు నిర్మాణంలో నిర్ణీత మోతాదులో ఇసుకను వాడాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ ఇందుగుల రోడ్డు నిర్మాణంలో ఇసుక జాడ ఎక్కడా కనిపించడం లేదు ఇసుక ఖరీదు ఎక్కువ అవుతుందన్న కక్కుర్తితో కాంట్రాక్టర్ యథేచ్ఛగా కంకర పొడి (డస్ట్) వాడుతూ పని పూర్తి చేస్తున్నారు డస్ట్‌తో వేసే రోడ్లు కేవలం కొన్ని నెలలకే బీటలు వారి, మొదటి వర్షానికే కుంగిపోతాయని తెలిసినా, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై కమిషన్ల మత్తు లో ఉన్నారా? లేక కాంట్రాక్టరే అధికారులను శాసిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాల కార్మికుల ఇష్యూపై స్పందించిన అధికారులు, రోడ్డు నాణ్యతను ఎందుకు పరిశీలించడం లేదు? చిన్నారులను పంపించి వేయడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారా? ప్రజల సొమ్ముతో నిర్మించే రోడ్డు నాణ్యత లేకపోతే ఆ నష్టానికి బాధ్యులు ఎవరు? పనులు జరుగుతున్న సమయంలో నిలబడి పర్యవేక్షించాల్సిన ఏ ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం శోచనీయం ఇందుగుల రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను తక్షణమే అరికట్టాలి క్వాలిటీ కంట్రోల్ అధికారులు స్పందించి నిర్మాణ నమూనాలను సేకరించి పరీక్షించాలి నాణ్యత లేని డస్ట్ వాడకాన్ని నిలిపివేసి, నిబంధనల ప్రకారం ఇసుకతో పనులు చేయించాలి అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే గ్రామస్థులతో కలిసి ఉన్నతాధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన అధికారులపై, కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



