ఖమ్మం ఖిల్లాలో ముస్లిం లీగ్ పార్టీ ప్రవేశం
ముస్లిం ఓటు బ్యాంక్‌పై రాజకీయ చర్చలు
కొత్త సమీకరణాల సూచనలు
ఖమ్మం, మార్చి 18, (జనంసాక్షి) : ఖమ్మం రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కార్యకలాపాలు ఖమ్మం జిల్లాలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కొనసాగుతున్న ఈ పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో భాగస్వామిగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగాల్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన షేక్ బాజీ బాబా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రస్తుతం జిల్లాలో పార్టీ విస్తరణపై దృష్టి సారించి వివిధ డివిజన్లలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
– ముస్లిం వర్గంలో అసంతృప్తి?
ఖమ్మం జిల్లాలో ముస్లిం సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటినా, ముస్లింలకు ప్రాధాన్యమైన ప్రోటోకాల్ పదవులు పెద్దగా దక్కలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఖమ్మం నియోజకవర్గంలో గానీ, జిల్లా వ్యాప్తంగా గానీ ముస్లిం వర్గానికి గౌరవప్రదమైన పదవులు ఇవ్వలేదని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని లేక్యూ క్లబ్ సమీపంలో షాదీఖానా నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ షాదీఖానా అంశంలో స్పష్టత లేకుండా ఉందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. షాదీఖానాను వేరే ప్రాంతానికి తరలించే ఆలోచన జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
– కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం?
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ముస్లిం ఓటు బ్యాంక్ కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ బలపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని నాయకులు ముస్లిం లీగ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల కుటుంబం రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తుండగా, మరోవైపు ముస్లిం సామాజిక వర్గం తమ భవిష్యత్ రాజకీయ దిశపై ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఖమ్మం రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా, రాబోయే ఎన్నికలు ఖమ్మం రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.



