ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడండి

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బహిరంగ లేఖ
మెదక్ జిల్లా బ్యూరో చీఫ్, ఏప్రిల్ 13( జనం సాక్షి):
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో రైతులు ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్ట్ నీటి విడుదలలో స్పష్టత లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కింది అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీరు విడుదల చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మంజీరా డ్యామ్ అధికారులకు సరైన ఆదేశాలు లేకపోవడంతో ఫీల్డ్ స్థాయిలో వ్యవసాయానికి నీటి విడుదల జరగ లేదు. ఈ సమస్యను నేను గత నెలలో గౌరవ ఇరిగేషన్ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి రైతుల తరఫున వినతి పత్రం అందజేశాను. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో కూడాప్రస్తావించాను. గౌరవ మంత్రిగారి మౌఖిక ఆదేశాల ప్రకారం ఈఎన్ సీ , ఎస్ ఈ గారి ద్వారా సింగూర్ ప్రాజెక్ట్ డి ఈ కి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఫీల్డ్ స్థాయిలో అధికారుల మధ్య సమన్వయం లోపం ఉంది. ఇరిగేషన్ విభాగం అధికారులు ఒక విధంగా, మంజీరా డ్యామ్ అధికారులు మరో విధంగా స్పందించడం వల్ల రైతులకు పంట నష్టం జరుగుతోంది. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించాను. ఇప్పటికే సుమారు 30 శాతం పంటలు ఎండిపోయాయి. ఘన్పూర్ అనకట్టకు విడుదల చేయాల్సిన నీరు విడుదల చేయకపోతే, ఈ అనికట్ పరిధిలో 10 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, 7 చెక్ డ్యామ్లు ఉన్నాయి. అధికారికంగా 21,650 ఎకరాలు, అనధికారికంగా సుమారు 60,000 ఎకరాల వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవాలంటే చివరి తడిగా కనీసం 0.3 టీఎంసీల నీటిని తక్షణం విడుదల చేయడం అత్యవసరం. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉండగా నీటి కొరత వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు, నీటి లభ్యత లేకపోతే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. పంటలు నష్టపోతే రైతులు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి విడుదలపై స్పష్టమైన మరియు లిఖితపూర్వక ఆదేశాలు వెంటనే జారీ చేయవలసిందిగా, రైతుల పంటలు ఎండిపోకుండా ఉండేందుకు తక్షణమే 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయవలసిందిగా, రైతుల తరఫున వినమ్రంగా కోరుతున్నాను.


