రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..
గంభీరావుపేట ఏప్రిల్ 14(జనం సాక్షి)
తెలంగాణ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం గంభీరావుపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో, గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ మల్లు గారి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్‌ఐ అనిల్ కుమార్,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రజలు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను వివరించారు.హెల్మెట్ ధారణ: ద్విచక్ర వాహనదారులు ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణరక్షక కవచంలా పనిచేస్తుందని సూచించారు.మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు: మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల డ్రైవర్‌కే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం ఏకాగ్రతను దెబ్బతీస్తుందని, అది ప్రమాదాలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
సదస్సు అనంతరం, రోడ్డు రవాణా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తామని, ‘ప్రమాద రహిత గ్రామం’గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అధికారుల సమక్షంలో గ్రామస్థులందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, యువత ఆశాలు, ఏఎన్ఎంలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


